నవతెలంగాణ-హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ అస్సాంలో బీజేపీకి గట్టి దెబ్బతగిలింది. మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నందితా గోర్లోసా కాంగ్రెస్‌లో చేరారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ నిరాకరించడంతో బిజెపికి గుడ్‌బై చెప్పారు. తన మంత్రి పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దిలీప్ సైకియాకు రాజీనామా లేఖను సమర్పించిన కొద్దిసేపటికే ఈనిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
హాప్లాంగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పార్టీ అభ్యర్థిగా ఉన్న అస్సాం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నిర్మలా లాంగ్‌థాసాతో సహా సీనియర్ నేతల సమక్షంలో గోర్లోసా పార్టీలో చేరారని కాంగ్రెస్ నేత జితేంత్ర సింగ్ అల్వార్ ఆదివారం సోషల్‌మీడియా ఎక్స్‌లో పేర్కొన్నారు. హాప్లాంగ్ నుండి గోర్లోసా అభ్యర్థిగా పోటీ చేసేందుకు వీలుగా నిర్మలా లాంగ్తాసా ఆ నియోజకవర్గాన్ని వదులుకునేందుకు అంగీకరించారని అన్నారు. హాప్లాంగ్‌నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గోర్లోసాను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటిస్తామని పార్టీ పేర్కొంది. కాగా, 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది.



