నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కు చెందిన ఓ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. నిందితుడికి పాకిస్థాన్ హ్యాండ్లర్‌లతో విస్తృత పరిచయాలు ఉన్నట్టు దర్యాప్తులో తేలడంతో రాజస్థాన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన జబరా రామ్‌ను ఓ కేసులో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నించగా.. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సంబంధం ఉన్న సుమిత్ కుమార్ గురించి తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 36 ఏళ్ల సుమిత్.. అస్సాంలోని దిబ్రుగఢ్ జిల్లాలో చబువా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో మల్టీ టాస్కింగ్ వింగ్‌లో పనిచేస్తున్నాడు.
సుమిత్‌ను అరెస్ట్ చేసేందుకు రాజస్థాన్ ఇంటెలిజెన్స్‌తోపాటు ఎయిర్‌ఫోర్స్ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నాయి. డబ్బు తీసుకొని.. యుద్ధ విమానాలు, క్షిపణుల వ్యవస్థ, వాటి స్థానం, ఎయిర్‌ఫోర్స్ అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్ హ్యాండ్లర్లకు చేరవేసినట్టు తేలింది.



