Monday, March 23, 2026
E-PAPER
Homeజిల్లాలుమొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తహసిల్దార్‌కు వినతి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తహసిల్దార్‌కు వినతి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్‌పల్లి: తక్షణమే తమ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ మండలంలోని కోనా సముందర్ గ్రామానికి చెందిన రైతులు సోమవారం తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటులో జాప్యం జరుగుతుండడంతో రైతులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయిస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. రైతుల బలహీనతను ఆశగా చేసుకున్న దళారులు రైతులను నిలువున ముంచుతూ తక్కువ ధరకే మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అడపాదడపా పడుతున్న అకాల వర్షాల నుండి పంటను కాపాడుకునేందుకు రైతులు ఎన్నో అవస్థలు పడాల్సి వస్తుందన్నారు.

ఒకపక్క రైతును దళారులు తక్కువ ధరతో మోసం చేస్తుంటే, మరోపక్క వాతావరణం కూడా అనుకూలించక రైతులు రెండు విధాలుగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధరతో పంటను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్ కు రైతులు అందజేశారు. రైతుల కోరికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తహసిల్దార్ హామీని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు జైడి శ్రీనివాస్, బి.శంకర్, నాగరాజు, గంగారెడ్డి, నర్సయ్య, ప్రశాంత్, బాలయ్య, లింబయ్య, హన్మంత్, భూమన్న, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -