నవతెలంగాణ – ఆలేరు రూరల్
భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ వంటి మహా విప్లవ వీరులు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అతి చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించారని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసుల నరేష్ పేర్కొన్నారు. సోమవారం భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర హాస్టల్లో “డ్రగ్స్, గంజాయి వద్దు – మన ఆరోగ్యం ముద్దు” అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ పాలన కాలంలో సామ్రాజ్యవాదం విస్తరించిన తరుణంలో దానికి వ్యతిరేకంగా పోరాడి అనేకమంది అమరవీరులు బలి అయ్యారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులకు కూడా సామ్రాజ్యవాద విధానాలే కారణమని వారు విమర్శించారు. స్వాతంత్ర్య ఉద్యమం నుండి ఇప్పటివరకు సామ్రాజ్యవాదం విస్తరిస్తూనే ఉందని, దానికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహనీయుల చరిత్రను వక్రీకరిస్తూ విద్యార్థులకు తప్పుడు పాఠాలు బోధిస్తోందని, భారతదేశాన్ని కులం,మతం పేరుతో విభజించేందుకు కుట్రలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఈ పరిస్థితులను ఎదిరించేందుకు విద్యార్థి లోకం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్ యువత, విద్యార్థులకు దూరంగా ఉందని, రాజీవ్ యువ వికాస్ పథకానికి సరైన కేటాయింపులు చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు విప్లవ్,ఎస్ఎఫ్ఐ మండల కమిటీ సభ్యులు కంతి రాజకుమార్, కంతి విక్రమ్,సాయిని కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.



