Thursday, March 26, 2026
E-PAPER
Homeజాతీయంప్రధాని మోడీ తీరుపై నటుడు కిషోర్ ఫైర్

ప్రధాని మోడీ తీరుపై నటుడు కిషోర్ ఫైర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇంధన కొరత నేపథ్యంలో దేశ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని ప్రధాని మోడీ పిలుపునివ్వడంపై నటుడు కిషోర్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. దేశాన్ని కులమతాల వారీగా విభజించి, ప్రజల మధ్య ద్వేషాన్ని నింపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ‘అందరం కలిసి ఒకే దేశంగా’ ఉండాలని కోరడంపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న తీరును తప్పుబడుతూ, దేశాన్ని మళ్ళీ కోలుకోలేని విధంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులుగా విడగొట్టిన తర్వాత ఏ మొహం పెట్టుకుని కలిసి ఉండాలని అడుగుతున్నారని కిషోర్ ప్రశ్నించారు. ప్రధాని తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల దేశం ఇప్పటికే ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని, రాబోయే రోజుల్లో ఇంకెంత మూల్యం చెల్లించుకోవాలోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా నోట్ల రద్దు, రఫేల్ ఒప్పందం నుంచి కరోనా లాక్‌డౌన్‌, అగ్నివీర్, వ్యవసాయ చట్టాల వరకు ఏ ఒక్క నిర్ణయానికైనా ప్రజలనో, ప్రతిపక్షాలనో లేదా ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే బ్యూరోక్రాట్లనో సంప్రదించారా అని ఆయన నిలదీశారు. మణిపూర్ హింస, కాశ్మీర్, లడఖ్ సమస్యల నుంచి ఎప్‌స్టైన్ ఫైల్స్‌ అంశం వరకు ప్రధాని వైఖరిని ఎండగడుతూ, యుద్ధ నేరస్తులను కౌగిలించుకుని మద్దతు తెలిపే ముందు ప్రజల అనుమతి తీసుకున్నారా అని కిషోర్ ప్ర‌శ్నించాడు. కరోనా సమయంలో దాదాపు 50 లక్షల మంది భారతీయులు చనిపోయినా, ప్రభుత్వం వారిని కనీసం లెక్కలోకి కూడా తీసుకోలేదని, ప్రజలు గొర్రెల మందలా చావడానికి ఇక సిద్ధంగా లేరని కిషోర్ హెచ్చరించారు. ప్రధాని తీరును నాన్-బయోలాజికల్ మ్యాడ్నెస్ (అశాస్త్రీయమైన వెర్రితనం) గా అభివర్ణించిన కిషోర్‌.. ఇలాంటి ధోరణి దేశ అత్యున్నత పదవిని అపహాస్యం చేస్తోందని, ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన ఘాటుగా స్పందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -