నవతెలంగాణ-కోహెడ
కోహెడ గ్రామపంచాయతీ పరిధిలోని పాత భవనాల్లో ఉన్న 3 షట్టర్లు, నూతన కాంప్లెక్స్‌లోని 14 షట్టర్లను నేడు (శనివారం) బహిరంగ వేలం ద్వారా కేటాయించనున్నట్లు సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్ తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు గ్రామపంచాయతీకి ఎలాంటి బకాయిలు లేకుండా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. పాత షాపుల కోసం రూ.50,000, కొత్త కాంప్లెక్స్ షాపుల కోసం రూ.20,000 డిమాండ్ డ్రాఫ్ట్ లేదా నగదు రూపంలో ముందుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక్క డీడీ ద్వారా ఒక్క షట్టర్ మాత్రమే పొందవచ్చని, మరిన్ని షాపులు తీసుకోవాలంటే అదనపు డీడీలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. వేలంలో ఎక్కువ మొత్తాన్ని కోట్ చేసిన వారికి షట్టర్లు కేటాయించబడతాయి. షట్టర్ పొందిన వారు వెంటనే మొత్తంలో నాలుగో వంతు (1/4) చెల్లించాల్సి ఉండగా, మిగిలిన మొత్తాన్ని ప్రతీ నెల 5వ తేదీలోపు చెల్లిస్తూ, పోస్ట్ డేటెడ్ చెక్కులు గ్రామపంచాయతీకి సమర్పించాల్సి ఉంటుందన్నారు. అదనంగా, షట్టర్లకు సంబంధించిన విద్యుత్ బిల్లులు కేటాయింపుదారులే చెల్లించుకోవాలని, పంచాయతీ అనుమతి లేకుండా ఎలాంటి మార్పులు, రిపేర్లు చేయరాదని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని వారిపై పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ లీజు కాలపరిమితి 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31 వరకు ఒక సంవత్సరానికి ఉంటుందన్నారు.. ఏదైనా కారణంతో వేలాన్ని రద్దు చేసే పూర్తి అధికారం గ్రామపంచాయతీకి ఉంటుందని పంచాయతీ కార్యదర్శి మాధురి తెలిపారు.



