నవతెలంగాణ-హైదరాబాద్: బ్రెజిల్లో మొదటి అంతర్జాతీయ ఫాసిస్టు వ్యతిరేక సదస్సు జరుగుతుంది. ఈ సదస్సు మార్చి 26 నుంచి 29 వరకు నాలుగురోజులపాటు జరుగుతుంది. దక్షిణ బ్రెజిల్ రాష్ట్రమైన రియో గ్రాండే డో సుల్లో జరుగుతున్న ఈ సదస్సుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది మంది సామాజిక ఉద్యమ కార్యకర్తలు పాల్గొన్నారు. రియో గ్రాండే డో సుల్ రాజధాని పోర్టో అలెగ్రే వీధుల్లో ఈ సదస్సుకు హాజరైనవారు మార్చ్ చేశారు. భారీ ప్రదర్శన నిర్వహించారు. అమెరికా దాడులని ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ సదస్సులో సంస్థాగత రాజకీయాల పాత్రపై జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో స్పెయిన్కు చెందిన యూరోపియన్ పార్లమెంట్ సభ్యురాలు అనా మిరాండా ‘వెనిజులా, క్యూబా, మెక్సికో, ఇరాన్, పాలస్తీనా, లిబియా, సిరియాలపై జరిగిన దాడులను ఖండించారు.
ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో ఈ దేశాల సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడం కూడా తప్పనిసరి లక్ష్యంగా ఉండాలని ఆమె అన్నారు. అలాగే ఫాసిస్టు విధానాలను తీసుకెళ్లడంలో అమెరికా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రస్తుతం ఉత్తర అమెరికా సామ్రాజ్యవాదం ప్రజలను చంపడానికి సిద్ధంగా ఉంది అని ఆమె నొక్కి చెప్పారు. యువత సాధికారత, ప్రజా ఉద్యమాలకు సంబంధించిన కార్యకలాపాలు ఈ సదస్సులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. లాటిన్ అమెరికా, ఇతర ప్రాంతాలకు చెందిన 1,800 మంది కార్యకర్తలు సంతకం చేసిన సూత్రాల ప్రకటన ఈ కార్యక్రమానికి మద్దతునిచ్చింది.



