Friday, March 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహర్మూజ్‌ జలసంధిలో చమురు ట్యాంకర్‌ ధ్వంసం.

హర్మూజ్‌ జలసంధిలో చమురు ట్యాంకర్‌ ధ్వంసం.

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో అట్టుడుకుతున్న పర్షియన్ గల్ఫ్‌లో మరోసారి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. హర్మూజ్ జలసంధిలో తమ నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశించిన ఓ ఆయిల్ ట్యాంకర్‌పై శుక్రవారం ‘ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్’ క్షిపణులతో దాడిచేసి ధ్వంసం చేసింది. దాడికి గురైన ట్యాంకర్ పాకిస్థాన్ జెండాతో ఉన్నట్లు కథనాలు సూచిస్తున్నాయి. ఇరాన్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి జలసంధిని దాటేందుకు ప్రయత్నించడంతోనే ఈ దాడి జరిగినట్లు ఇరాన్ వర్గాలు తెలిపాయి.

మరోవైపు పాకిస్థాన్ జెండా మాటున చమురును అక్రమంగా అమెరికాకు తరలిస్తున్నారని, దానికి ప్రతీకారంగానే ఈ దాడి జరిగిందనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ట్యాంకర్‌కు మంటలు అంటుకుని పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో సిబ్బంది ప్రాణనష్టంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడులు చేసినప్పటి నుంచి హర్మూజ్ జలసంధిని ఇరాన్ తన నియంత్రణలోకి తీసుకుంది.

ఇరాన్‌ తన అనుమతి లేకుండా హర్మూజ్‌ జలసంధిలోకి ఏ నౌక ప్రవేశించరాదని ఆంక్షలు విధించింది. దాంతో ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం స్తంభించిపోగా.. 85కి పైగా ట్యాంకర్‌లు గల్ఫ్‌లోనే చిక్కుకుపోయాయి. మార్చి 11న కూడా థాయ్‌లాండ్‌కు చెందిన నౌకపై దాడి జరిగింది. ఈ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లను దాటింది. తాజా ఘటనతో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -