నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్ పై ఏకపక్షంగా యుద్ధాన్ని ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు సొంత దేశంలోనే నిరసన సెగలు తగులుతున్నాయి. ఇరాన్‌పై యుద్ధం, ట్రంప్ వలసల విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. అమెరికాతో పాటు ఐరోపాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు గళమెత్తారు. పుట్ డౌన్ ద క్రౌన్, క్లౌన్, నో కింగ్స్ వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఇరాన్‌తో నెల రోజులుగా భీకరంగా సాగుతోన్న యుద్ధం కారణంగా అమెరికాలో నిత్యవసరాల ధరలు పెరగడం, ఇంధన సంక్షోభం ఏర్పడటంతో ఆగ్రహానికి గురైన ప్రజలు రోడ్డెక్కి ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. అనవసరమైన యుద్ధంలో తలదూర్చి అమెరికాకు నష్టం కలిగిస్తున్నారంటూ ట్రంప్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికాలోని 50 రాష్ట్రాలతో పాటు ఐరోపాలోని ప్రధాన నగరాల్లో సుమారు 90 లక్షల మంది ఈ నిరసనల్లో పాల్గొన్నట్లు సమాచారం. ముఖ్యంగా మిన్నెసోటా ఈ నిరసనలకు కేంద్ర బిందువుగా మారింది. ట్రంప్ కఠిన వలసల వైఖరిని వ్యతిరేకిస్తూ లక్షలాది మంది సెయింట్ పాల్లోని క్యాపిటల్ లాన్ దగ్గర ర్యాలీ నిర్వహించారు. అలాగే, వాషింగ్టన్ డీసీలోని లింకన్ మెమోరియల్ నుంచి నేషనల్ మాల్ వరకు వందలాది మంది ఆందోళనకారులు శంఖాలు ఊదుతూ, డప్పులు కొడుతూ ర్యాలీగా వెళ్లారు. యూరప్ దేశాల్లోని రోమ్, లండన్, పారిస్, ఆమ్స్టర్డ్యామ్, మాడ్రిడ్ వంటి ప్రధాన నగరాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ‘మాకు ప్రజాస్వామ్యం కావాలి – నిరంకుశత్వం వద్దు’.. పాలకుడు కావాలి డిక్టేటర్ వద్దు అంటూ నినాదాలు హోరెత్తించారు. అమెరికా చరిత్రలోనే ఇవి అతిపెద్ద పౌర నిరసనలుగా నిలవనున్నాయని నిర్వాహకులు అంచనా వేశారు.



