Monday, March 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబంగారు గని వద్ద దుండగుల దాడి..70 మంది మృతి

బంగారు గని వద్ద దుండగుల దాడి..70 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దక్షిణ సూడాన్‌లో మారణహోమం చోటుచేసుకుంది. రాజధాని జుబాకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెబెల్ ఇరాక్ బంగారు గని వద్ద గుర్తుతెలియని సాయుధ దుండగులు జరిపిన దాడిలో 70 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య 85 వరకు ఉండొచ్చని కొన్ని అనధికారిక వర్గాలు చెబుతున్నాయి.

ప్రాథమిక నివేదికల ప్రకారం, బంగారు గని వద్ద తలెత్తిన ఒక వివాదమే ఈ దాడికి కారణమైంది. సాయుధ దుండగులు ఒక్కసారిగా పౌరులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అనేక మంది తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రాంతంలోని గనిపై దాడి జరగడం ఇది రెండోసారి.

దక్షిణ సూడాన్‌లో 2018 శాంతి ఒప్పందం ఉల్లంఘనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు సాధారణమయ్యాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ గనుల తవ్వకాలు, స్థానిక యువత మధ్య విభేదాలు, వివిధ సాయుధ గ్రూపుల ఆధిపత్య పోరు వంటివి తరచూ ఘర్షణలకు దారితీస్తున్నాయి.

ఈ ఘటనపై దక్షిణ సూడాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, దేశ మైనింగ్ మంత్రిత్వ శాఖ ఈ దాడిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ దాడి దేశంలోని బలహీనమైన శాంతి ప్రక్రియకు మరింత విఘాతం కలిగిస్తుందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -