నవతెలంగాణ – డిచ్ పల్లి : ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కుటుంబాలకు దీమా అని, తెలంగాణను బీఆర్ఎస్ అప్పులపాలు చేసిందని, ప్రతి పేద వాడి కళ్ళల్లో ఆనందం కోసం కాంగ్రెస్ సదా సిద్ధంగా ఉంటుందని,పేదల సంక్షేమానికి కట్టుబడి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పేర్కొన్నారు. గురువారం డిచ్ పల్లి మండలంలోని మెంట్రాజ్ పల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ ఎడ్ల ప్రవళిక వినోద్ అధ్యక్షతన జరిగిన గ్రామసభ తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో ప్రారంభించారు.
అనంతరం శాఖల వారిగా సంబంధిత అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును వారు వివరించారు. గ్రామంలో 30 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 26 నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయని,అటు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే వద్దకు వచ్చి ఆనందం వ్యక్తంచేశారు. 75 మహిళా సంఘాలు ఉండగా దాదాపు 4కోట్లకు పైగా రుణాలు అందించినట్లు వివరించారు. ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మాట్లాడుతూ… ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద వాడి కళ్లలో ఆనందం వెల్లివిరుస్తుందని చెప్పారు. గ్రామంలో 30 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 26 నిర్మాణం పూర్తి చేసుకున్నాయని.. రెండవ విడతలో మరిన్ని ఇండ్లు మంజూరు చేసి.. అర్హులైన ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరేలా చూస్తామన్నారు.ఐకేపీ రుణాల ద్వారా 18మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రుణాలు అందించడం అభినందనీయ మన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా రాష్ట్రంలో 1 కోటి 15లక్షల కుటుంబాలకు రూ. లక్షల చొప్పున బీమా సౌకర్యం కల్పిస్తుందన్నారు. అదేవిధంగా విద్యా,వైద్యం వంటి రంగాలకు పెద్దపీట వేస్తుందని.. అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి నిధులు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. పక్కనే ఉన్న తెలంగాణ యూనివర్సిటీలో రూ.90 కోట్లకు పైగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. బాలబాలికలకు హాస్టళ్లు, నూతనమైన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అటు బీజేపీ,బిఆర్ఎస్ నాయకుల తీరును ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక అనవసరపు రాద్ధాంతాలు చేస్తున్నారని మండిపడ్డారు. సర్పంచ్ ఎడ్ల ప్రవళిక వినోద్ పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మెంట్రాజ్ పల్లి చైతన్యవంతమైన గ్రామమని గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్,ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గోట్టిపాటి వాసు,కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంచందర్ గౌడ్, అంబర్ సింగ్, ధర్మగౌడ్, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సాయిలు, ఆనంద్, ఉప సర్పంచ్ సురేష్, అధికారులు,ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.



