Sunday, April 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రయివేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీ పై సీఎం మౌనం ఎందుకు?

ప్రయివేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీ పై సీఎం మౌనం ఎందుకు?

- Advertisement -

– ఫీజుల నియంత్రణ బిల్లుపై..
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెట్టటం లేదు? : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కార్పొరేట్‌ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలను ఆగం చేస్తున్న కార్పొరేట్‌ విద్యాసంస్థల మీద రాష్ట్ర ప్రభుత్వానికి అంత ప్రేమెందుకని నిలదీశారు. మహిళా బిల్లు కోసం ప్రత్యేకంగా పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించినప్పుడు లక్షలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు న్యాయం చేసేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఎందుకు నిర్వహించటం లేదని ప్రశ్నించారు. వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరారు. దీనిపై తెలంగాణ విద్యా కమిషన్‌ ముసాయిదా బిల్లు సిద్దం చేసి నెలలు గడుస్తున్నా ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్పొరేట్‌ విద్యాసంస్థల దోపిడీపై ముఖ్యమంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
ముసాయిదా బిల్లు సిద్ధమైన తర్వాత కూడా భారీ ఎత్తున కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఫీజులు పెంచాయని గుర్తు చేశారు. సామాన్య ప్రజలు ఫీజులు చెల్లించలేక ఆగమవుతుంటే ప్రభుత్వం మాత్రం ఈ బిల్లును అటకెక్కించిందని మండిపడ్డారు. ఫీజుల దోపిడీ కారణంగా సామాన్య కుటుంబాల జీవితకాలపు పొదుపు మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు సేవ్‌ సింగరేణి రౌండ్‌ టేబుల్‌ సమావేశం
సింగరేణి సంస్థను కాపాడేందుకు తెలంగాణ జాగృతి, హెచ్‌ఎంఎస్‌ ఆధ్వర్యంలో ఆదివారం సేవ్‌ సింగరేణి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించే రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌, వివిద కార్మిక సంఘాల నాయకులు పాల్గొంటారు. సింగరేణిలో మెడికల్‌ బోర్డు నిర్వహణ, సంస్థకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు, అలియాస్‌ పేర్ల అంశం, కారుణ్య నియమాకాలు, సంస్థ మనుగడ కోసం చేపట్టాల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -