– పంపిణీ చేసిన వైస్ ఛైర్ఫపర్సన్జూపల్లి రమేష్ బాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వ జూనియర్ కళాశాల అశ్వారావుపేటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత నోట్‌బుక్స్, బ్యాగులు, బూట్ల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఏ.అనిత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట మున్సిపాలిటీ వైస్‌చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అనిత మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు మాత్రమే అందించేవారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి నోట్‌బుక్స్, బ్యాగులు, బూట్లతో పాటు యూనిఫాంలను కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యను కొనసాగించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యఅతిథి జూపల్లి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, బ్యాగులు, బూట్లు, యూనిఫాం తదితర సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులు, కళాశాల, అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
అనంతరం విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగులు, బూట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాశాల సీనియర్ అధ్యాపకులు, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి అరవింద్‌బాబు, కళాశాల లైబ్రేరియన్ ఎస్.కె. సాహిదా, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.



