Saturday, August 22, 2026
E-PAPER
Homeజాతీయంపాఠశాలల బచావో ఆందోళన బలోపేతం

పాఠశాలల బచావో ఆందోళన బలోపేతం

- Advertisement -


ప‌ది కోట్ల సంత‌కాలు సేక‌ర‌ణ‌
జిల్లా, మండల స్థాయిల్లో వినతిపత్రాలు అందజేత
రాష్ట్రస్థాయి సద‌స్సులు, రాజ్‌భ‌వ‌న్‌కు మార్చ్‌లు : విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ నేతలు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో

గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమైన పాఠశాలల బచావో ఆందోళనను ఎస్ఎఫ్ఐ మరింత బలోపేతం చేయనుంది. ఈ ఆందోళనలో భాగంగా, అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలలను సందర్శించి నివేదికలు తయారు చేస్తామ‌ని ఎస్ఎఫ్ఐ నేత‌లు ప్ర‌క‌టించారు. శుక్ర‌వారం నాడిక్క‌డ హ‌రి కిష‌న్ సింగ్ సుర్జీత్ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య, ఉపాధ్యక్షుడు సుభాష్ జాఖర్, కేంద్ర కమిటీ సభ్యులు సూరజ్ ఇలామన్, కాంతి కుమారి, ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షురాలు నాడియా మాట్లాడారు. పాఠశాలల మూసివేత, విలీనాల కారణంగా చదువులకు ఆటంకం కలిగిన విద్యార్థులను గుర్తించి, వారిని సంఘటితం చేస్తామ‌ని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, మూసివేసిన పాఠశాలలను తిరిగి తెరవడానికి స్థానికులను భాగస్వాములను చేస్తూ ఆందోళ‌నలు చేప‌డ‌తామ‌ని అన్నారు. ఈ ఆందోళనలో భాగంగా పది కోట్ల సంతకాలు సేకరిస్తామ‌ని, పాఠశాలల దుస్థితికి సంబంధించి బ్లాక్, సబ్-డివిజన్, జిల్లా స్థాయి కార్యాలయాలకు వినతిపత్రం అంద‌జేస్తామ‌ని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సమావేశాలు, సభలు, రాజ్‌భవన్‌ మార్చ్‌లు నిర్వహిస్తామ‌ని, అక్షరాస్యతా దినోత్సవమైన సెప్టెంబర్ 8న ఢిల్లీలో తొలి సమావేశం నిర్వహిస్తామ‌ని అన్నారు. ‘‘ప్రభుత్వ విద్యా వ్యవస్థకు మరిన్ని నిధులు కేటాయించడం, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయడం, మూసివేసిన అన్ని ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరవడం, 1:20 నిష్పత్తిలో ఉపాధ్యాయులను నియమించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, బడి మానేసే వారిని నివారించడానికి చర్యలు తీసుకోవడం’’ వంటివి తమ ప్రధాన డిమాండ్లని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ ప్రచురణ ‘స్టూడెంట్స్ స్ట్రగుల్’ ప్రత్యేక సంచికను కూడా విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -