చావ రవి కుటుంబ బాధలో, దుఖంలో భాగం పంచుకుంటాం
చావ సరస్వతమ్మకు నివాళులర్పించిన బీ.వీ.రాఘవులు
భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించిన కుటుంబ సభ్యులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎస్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి కుటుంబ బాధలో, దుఖంలో భాగం పంచుకునేందుకు సీపీఐ(ఎం) సదా సిద్ధంగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీ.వీ.రాఘవులు భరోసాని చ్చారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో చావ రవి మాతృమూర్తి చావ సరస్వతమ్మ భౌతిక కాయాన్ని ఆయన సందర్శించి పార్టీ పక్షాన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సంతాప సభలో రాఘవులు మాట్లాడుతూ సరస్వతమ్మ మరణం బాధాకరమన్నారు. రవి తల్లిగా తనకు పరిచయమనీ, ఆయన తండ్రి భాస్కర్ రావుతోపాటు రవితో ఉన్న అనుబంధాన్ని మరిచిపోలేమన్నారు. బాధ తాత్కాలికంగా ఉండాలనీ, ధైర్యం శాశ్వతంగా మిగిలిపోవాలని ఆకాంక్షించారు. సరస్వతమ్మ కుటుంబం మనో నిబ్బరంతో జీవితం సాగించాలని ఆకాంక్షించారు. ఆమెకు ఉన్న సంకల్పం వారిని ఆ దిశగా నడిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్థీవదేహాన్ని వైద్య కళాశాలకు అప్పగించాలని కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని రాఘవులు అభినందించారు. శరీరం, అవయవాల వితరణ సంస్కృతి పెరగాలని, మరణించిన వ్యక్తి మరికొందరికి జీవితాన్ని ప్రసాదించాలని కోరారు. మరణం సహజమని, కానీ విలువలతో కూడిన జీవితాన్ని గడిపి, మరణం తర్వాత కూడా అదే విలువలను సరస్వతమ్మ నెలకొల్పారని కొనియాడారు. చావ రవి, ఆయన తండ్రి భాస్కర రావు ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
పలువురు ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులతో పాటు బంధువులు, మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై సరస్వతమ్మకు నివాళులర్పించారు. ఆమెకు విప్లవ జోహార్లు తెలిపారు. అమరజీవి సరస్వతమ్మ ఆశయాలను కొనసాగిస్తామనీ, ఆమె ఆలోచనలను ఆచరణలో పెట్టి ఆదర్శంగా సమాజ హితం కోసం జీవిస్తామని నినదించారు. గురువారం మరణించిన సరస్వతమ్మ భౌతిక కాయాన్ని రెండు రోజుల పాటు సందర్శనార్థం ఉంచగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాటు ప్రజా సంఘాలు, అభిమానులు, బంధు, మిత్రుల పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆ కుటుంబంతో, సరస్వతమ్మతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అందరిని కుటుంబ సభ్యుల్లా భావించి ఆదరించిన ఆమె వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబంలోనూ కలివిడిగా ఉంటూ అందరితో చేత ప్రశంసలందుకున్నారని తెలిపారు. అదే సమయంలో ఉద్యమాలకు సహకరించే కుటుంబంగా అందరిని ఆదరించారని చెప్పారు. అప్యాయమైన పలకరింపుతో మానవ సంబంధాలకు ఆమె చిరునామాగా నిలిచారని కొనియాడారు. ఆమె చూపించిన ఆదర్శాలను కొనసాగిస్తామన్నారు.
సంతాపసభలో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంకట్, టీపీటీఎఫ్ అధ్యక్షులు అనిల్ కుమార్, డీటీఎఫ్ అధ్యక్షులు సోమయ్య, టాప్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, నాయకులు విద్యాసాగర్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు కొంగల వెంకట్, ఎంఎస్టీఎఫ్ అధ్యక్షులు కొండయ్య, టీఎస్ యూటీఎఫ్ మాజీ అధ్యక్షులు రాములు, జంగయ్య, సీనియర్ నాయకులు సంయుక్త, నరహరి, మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సరస్వతమ్మ భౌతికకాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం సనత్ నగర్ లోని ఈఎస్ఐ వైద్య కళాశాలకు కుటుంబ సభ్యులు అప్పగించారు. శుక్రవారం ఉదయం కళాశాల సిబ్బంది టీఎస్ యూటీఎఫ్ కార్యాలయం నుంచి ఆమె భౌతికకాయాన్ని కళాశాలకు తరలించారు. ఈ సందర్భంగా కార్యాలయం నుంచి సమీపంలోని స్టీల్ బ్రిడ్జి వరకు వందలాది మందితో ర్యాలీ నిర్వహించారు. ఉద్యమాల సహకారిగా ఆమె సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తామని నినదించారు.
అమ్మ వల్లే… చావ రవి
తాను ఎదగడానికి తన తల్లి, కుటుంబమే కారణమని చావ రవి భావోద్వాగానికి గురయ్యారు. సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలకు పరిమితమైన కుటుంబమైనప్పటికీ తనను ఏనాడు బలవంతం చేయకుండా వారిచ్చిన స్వేచ్ఛ, నేర్పిన వ్యక్తిత్వమే ఎదగడానికి దోహదపడ్డాయని తెలిపారు. తనను అభ్యుదయ విలువలు పాటించేలాగా చేశాయన్నారు. తన తల్లికి తల్లిదండ్రుల ప్రేమ తెలియదనీ, అత్తమామల వద్ద పెరిగిన ఆమె 17వ ఏటా మెట్టింట అడుగు పెట్టి అందరితో కలివిడిగా ఉంటూ పెద్ద కుటుంబాన్ని సంపాదించు కుందన్నారు. ఆమె జీవించిన ప్రతి చోట అందరితో కలిసిపోయిన తీరు తమకు మానవ సంబంధాల విలువను నేర్పిందన్నారు.
మనో నిబ్బరంతో జీవితం సాగించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



