నవతెలంగాణ-మిరుదొడ్డి: ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర పబ్లిసిటీ కార్యదర్శిగా కుంబాల రవిని నియమించారు. ఈ నియామకాన్ని ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ సంస్థ జాతీయ అధ్యక్షుడు ఎస్.రాజు ఉస్తాద్. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వైద్యనాథ్ ఆదేశాల మేరకు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ సంస్థ అడ్వైజర్ బిట్ల వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ ట్రెజరర్ కడమంతి ముత్తయ్య చేతుల మీదుగా కుంబాల రవికి నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కుంబాల రవి మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని అంబేద్కర్ భవన్‌ను కేంద్రంగా తీసుకుని సంస్థ కార్యకలాపాలను విస్తరించి, షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను బలోపేతం చేయడం, సామాజిక వివక్షను నిర్మూలించడం, సమానత్వాన్ని స్థాపించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.అలాగే, ఎస్సీ సమాజంపై జరిగే అన్యాయాలు, అవమానాలు, దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని, విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు మరియు సంక్షేమ పథకాల సమర్థ అమలుకు ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. షెడ్యూల్ కులాల విద్యా, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా పోరాటం చేస్తామని అన్నారు.ఈ బాధ్యత తనపై మరింత నిబద్ధతను పెంచిందని, తనను ఎంపిక చేసిన సంస్థ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సమస్త అడ్వైజర్ బిట్ల వెంకటేశ్వర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ “జై భీమ్” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.



