నవతెలంగాణ-జన్నారం: తాడ్లపేట్ రేంజ్ పరిధిలోని తపాల్పూర్ సెక్షన్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అక్రమంగా చెట్లు నరికివేత,అటవీ ప్రాంతంలో నిప్పు పెట్టిన ఘటనకు సంబంధించి అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తాలాపేట ఎఫ్ఆర్ఓ సుష్మారావు తెలిపారు. ఈ కేసులో నిందితుడు A1. జైనేని రాజేష్ @ జైనేని రాజం, తండ్రి భీమయ్య, ఊట్ల గ్రామం, దండేపల్లి మండలం వాసి. ఇతడు తపాల్పూర్ సెక్షన్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అక్రమంగా చెట్ల నరికివేతకు పాల్పడటమే కాకుండా అటవీ ప్రాంతంలో నిప్పు పెట్టినట్టు విచారణలో తేలిందన్నారు. అటవీ శాఖ అధికారులు నిందితుడిని తత్రపోషగూడ గ్రామంలో పట్టుకొని, చట్టపరమైన చర్యలు చేపట్టి గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు పంపించడం జరిగిందన్నారు.
అటవీ సంపదను నాశనం చేసే చర్యలు, అక్రమ చెట్ల నరికివేత, అటవీ ప్రాంతాల్లో నిప్పు పెట్టడం వంటి నేరాలపై అటవీ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుందని తెలియజేస్తూ, అటవీ ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలు లేదా అక్రమ కార్యకలాపాలు గమనించిన పక్షంలో ప్రజలు సమీప అటవీ అధికారులకు వెంటనే సమాచారం అందించాలని అటవీ శాఖ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.



