Tuesday, April 7, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాను తీర్చిదిద్దుతా

పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాను తీర్చిదిద్దుతా

- Advertisement -
  • పిప్రి ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ సభలో సీఎం రేవంత్ రెడ్డి హామీలు
    నవతెలంగాణ-బజార్ హాత్నూర్: ఆదిలాబాద్‌ జిల్లా పిప్రి లో నిర్వహించిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి హామీలు ఇచ్చారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పాలమూరు జిల్లాతో సమానంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జల్–జంగల్ నినాదంతో పోరాట స్ఫూర్తిని చాటిన కొమురం భీమ్ గడ్డ ఇదని గుర్తుచేశారు. పీసీసీ అధ్యక్షుడిగా నిర్మల్‌లో నిరసనలు, ఇంద్రవెల్లి దండోరాలు, భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం సాగించామని తెలిపారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని, అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా ఈ సభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజలు నష్టపోకూడదనే ఉద్దేశంతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన సీఎం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని, ఇందుకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు. ఇప్పటివరకు రూ.5,400 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.

పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తూ, ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 3 కోట్లకు పైగా ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఈ పథకం అమలు చేస్తున్నామన్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు హైటెక్ సిటీలో మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించామని చెప్పారు. జిల్లా అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేస్తూ, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌కు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. కేంద్రంతో చర్చించి ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ మంజూరు చేయించామని, జూన్ 2 నాటికి శంకుస్థాపన చేసే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. పారిశ్రామిక కేంద్రంగా జిల్లాను అభివృద్ధి చేస్తామని, భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని చెప్పారు. యూనివర్సిటీ స్థాపనకు భూమి సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
ప్రతి రెండు నెలలకు ఒకసారి జిల్లాను సందర్శిస్తానని, అవసరమైన నిధులు తీసుకొస్తామని సీఎం హామీ ఇచ్చారు. “మేం పాలకులు కాదు… ప్రజల సేవకులం” అని పేర్కొన్నారు.

ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ…
మా సొంత మండలానికి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు తర్వాత 26 సంవత్సరాల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని ఎంపీ గోడం నగేశ్ తెలిపారు. ముఖ్యమంత్రి గారు క్రీడాకారుడిగా మాత్రమే కాకుండా క్రీడల అభివృద్ధికి భాగస్వామిగా నిలవాలని కోరారు. హైదరాబాద్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ఆనందదాయకమని ఆయన అభినందించారు. తన సొంత గ్రామంలో గత ఆరు సంవత్సరాలుగా స్పోర్ట్స్ స్కూల్ నడుస్తోందని, ప్రస్తుతం 10వ తరగతి వరకు మాత్రమే ఉన్న ఈ పాఠశాలను ఇంటర్మీడియట్ వరకు విస్తరించాలని కోరారు. అలా చేస్తే విద్యార్థులు క్రీడల్లో మరింత నైపుణ్యం సాధిస్తారని తెలిపారు. ఇటీవల నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో అదిలాబాద్ జిల్లా మొదటి స్థానం సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇచ్చోడ, బోథ్ ప్రాంతాల్లో స్పోర్ట్స్ స్టేడియంల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని, అలాగే ఆర్ అండ్ బి, పి ఆర్, ట్రైబల్ వెల్ఫేర్ తదితర శాఖలకు సంబంధించిన కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పనులకు బిల్లులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని ఎంపీ గోడం నగేశ్ విజ్ఞప్తి చేశారు.

బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం దృష్టికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తీసుకువచ్చారు. పిప్పిరి గ్రామంలో నిర్వహించిన గ్రామసభ సందర్భంగా సీఎంను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా నియోజకవర్గానికి రూ.200 కోట్ల యంగ్ ఇండియా స్కూల్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC), పిప్రి, తేజాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే సీఎం‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి పనులను ప్రతిపాదిస్తూ, బోథ్‌లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, బుగ్గారం, సుంకిడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు 22 కొత్త చెరువుల నిర్మాణం, 18 చెరువుల మరమ్మతులు, 23 చెక్‌డ్యామ్‌లకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

దహేగాం ప్రాజెక్ట్ నిర్వాసితులైన 200 కుటుంబాలకు పునరావాసం కింద ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బోథ్ పట్టణ అభివృద్ధి కోసం సెంట్రల్ లైటింగ్, రింగ్ రోడ్డుకు రూ.43 కోట్లు కేటాయించాలని, ఇచ్చోడ–సిరికొండ, సిరిచెల్మ–పులగంపండ్రి, భరంపూర్–మోర్కండి, జందాపూర్–కరంజి రహదారుల పనులను పూర్తి చేసి కొత్త రోడ్లకు నిధులు ఇవ్వాలని కోరారు.

అదేవిధంగా నేరడిగొండ, ఇచ్చోడ, బోథ్, తలమడుగు, సోనాల, భీంపూర్, సిరికొండ మండలాల్లో ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. విద్య, క్రీడా రంగాల అభివృద్ధి కోసం బోథ్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరారు. వ్యవసాయ రంగంలో సుంకిడి వద్ద మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా తలమడుగు, తాంసి, భీంపూర్ రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని, జొన్న, మొక్కజొన్న పంటలను పరిమితులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య రంగంలో ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు.

అదనంగా 2000 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, గిరివికాసం పథకానికి నిధుల పెంపు, గ్రామాల అభివృద్ధికి రూ.20 కోట్లు, రైతుల పొలాలకు వెళ్లే రోడ్ల నిర్మాణానికి మరో రూ.20 కోట్లు ఎస్‌డీఎఫ్ నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పర్యాటక అభివృద్ధి దృష్ట్యా కుంటాల, గాయత్రి, పొచ్చెర, కనకాయి జలపాతాలను అభివృద్ధి చేయాలని సూచించారు. సిరిచెల్మ మల్లికార్జున స్వామి, భరంపూర్ వెంకటేశ్వర స్వామి దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, ఇచ్చోడలో షాదిఖానా నిర్మాణానికి సహాయం చేయాలని కోరారు. అటవీ అనుమతుల కారణంగా నిలిచిపోయిన రహదారి పనులకు తక్షణ క్లియరెన్స్ ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ అన్ని అంశాలను వినతిపత్రం రూపంలో ముఖ్యమంత్రికి సమర్పించినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -