Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదో తరగతి మూల్యాంకనం, కుల గణన పారితోషికం వెంటనే చెల్లించాలి

పదో తరగతి మూల్యాంకనం, కుల గణన పారితోషికం వెంటనే చెల్లించాలి

- Advertisement -

– కామారెడ్డి స్పాట్ కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నిరసన
నవతెలంగాణ – కామారెడ్డి : పదో తరగతి పరీక్షల మూల్యాంకనం, కుల గణనకు సంబంధించిన పారితోషికాన్ని వెంటనే చెల్లించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పదో తరగతి మూల్యాంకన కేంద్రంలో ( జీవదాన్ పాఠశాలలో ) ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిజేఏసీ జిల్లా చైర్మన్ అల్లాపూర్ కుశాల్, యూఎస్‌పీసీ జిల్లా చైర్మన్ ఆకుల బాబు, జాక్టో జిల్లా చైర్మన్ సయ్యద్ ఖలీముద్దీన్ లు మాట్లాడుతూ, 2025 మార్చిలో నిర్వహించిన పదో తరగతి మూల్యాంకన విధులకు సంబంధించిన సుమారు రూ.20 కోట్ల పారితోషికం ఇప్పటికీ చెల్లించాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కుల గణన కార్యక్రమాన్ని సుమారు 50 వేల మంది సిబ్బందితో నిర్వహించినప్పటికీ, 18 నెలలు గడిచినా వారికి పారితోషికం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుల గణనలో ఎన్యుమరేటర్లకు రూ.10 వేల చొప్పున, పర్యవేక్షకులకు రూ.12 వేల చొప్పున సుమారు రూ.50 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని తెలిపారు. జనగణన పూర్తి అయిన తరువాత కూడా ఇంతకాలం పారితోషికం ఇవ్వకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. పదో తరగతి మూల్యాంకన విధులకు చెల్లించే పారితోషికం గత ఏడు సంవత్సరాలుగా పెంచలేదని, అంతర్ పరీక్షల మూల్యాంకన రేట్లు మాత్రం రెండుసార్లు పెంచినట్లు గుర్తుచేశారు.  పదో తరగతి మూల్యాంకన రేట్లను కనీసం 50 శాతం పెంచాలని, ఈ ఏడాది మూల్యాంకనం పూర్తి కాగానే విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు వెంటనే పారితోషికం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కొంతమేర చెల్లింపులు జరిగినా, మిగిలిన అన్ని జిల్లాల్లో 2025 మార్చి పదో తరగతి మూల్యాంకన పారితోషికం, కుల గణన పారితోషికాన్ని తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం, టీఆర్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షులు బషీర్, ఎస్‌టీయూటీఎస్ జిల్లా నాయకులు పంపరి ప్రవీణ్ కుమార్, డీటీఎఫ్ నాయకుడు ప్రభాకర్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు యాదయ్య, టీజీపీటీఏ జిల్లా అధ్యక్షుడు స్వామి గౌడ్, టీపీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మనోహర్, టీఎస్‌జీహెచ్ఎంఏ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ, టీఎస్పీటీఏ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుర్షిత్, పేటా టీఎస్ జిల్లా అధ్యక్షుడు రంగా వెంకటేశ్వర్ గౌడ్, పుట్ట శ్రీనివాస్ రెడ్డి, పంపరి ప్రవీణ్, ఎ. సాయిలు, శ్యాము కుమార్, లక్ష్మీరాజం, రాజేశ్వర్  వివిధ మండలాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -