- సామాజిక కార్యకర్త ఇమ్రాన్ జాకీ
నవతెలంగాణ-హైదరాబాద్: భారతదేశ పాస్‌పోర్ట్‌తో 50 దేశాలకు పైగా ప్రయాణించానని, దేశంలో తన గుర్తింపు ప్రశ్నార్థకమైందని కోల్‌కతా వ్యాపార వేత్త, సామాజిక కార్యకర్త ఇమ్రాన్ జాకీ (58) మంగళవారం తెలిపారు. భారతీయ పౌరుడిగా విదేశాల్లో గర్వంగా తిరిగానని అన్నారు. ఓటర్ల జాబితా నుండి తనపేరును తొలగించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్‌లో, ఎస్‌ఐఆర్ ప్రక్రియ అనంతరం ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితా నుండి లక్షలాది మంది పేర్లు తొలగించిన సంగతి తెలిసిందే. వారిలో ఇమ్రాన్ జాకీ పేరు కూడా ఉంది. పేర్లు తొలగించబడిన వారంతా అణగారిన వర్గాలకు చెందినవారు. తమ పేర్లను ఎందుకు తొలగించారన్న ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారు.
సర్ ప్రక్రియలో ఉన్న అన్యాయమైన, వివక్షాపూరిత స్వభావాన్ని ఇమ్రాన్ ఉదాహరణ స్పష్టం చేసింది. భారతీయ పౌరుడిగా తన జాతీయతను గుర్తింపుకు అవసరమైన అన్ని పత్రాలను తాను సమర్పించానని అన్నారు. అయినప్పటికీ చౌరింగీ అసెంబ్లీ నియోజకవర్గం ఓటరు జాబితా నుండి తన పేరు తొలగించారని అన్నారు.
తన పేరును తొలగించడంతో పలు ప్రశ్నలు తలెత్తాయని అన్నారు. తాను భారతీయుడిని కాదా, తన పాస్‌పోర్ట్‌పై ఉన్న జాతీయ ముద్రల సంగతేంటి, అంటే పాస్‌పోర్ట్ కూడా చెల్లదా అని ప్రశ్నించారు. తాను సమర్పించిన పత్రాల్లో వైరుద్ధ్యం ఉందని బిఎల్‌ఒ అధికారి చెప్పారని, అయితే స్పష్టమైన వివరణనివ్వలేదని అన్నారు. తన తండ్రి పేరు కూడా తొలగించారని అన్నారు. తాను మొహమ్మదీయ స్పోర్టింగ్ క్లబ్ కార్యనిర్వాహక కమిటీలో ఉన్నానని, సెయింట్ జేవియర్స్ కాలేజీ కోల్‌కతా పూర్వ విద్యార్థుల సంఘానికి కార్యదర్శిగా పనిచేశానని అన్నారు. ఇప్పటికీ క్రియాశీల సభ్యుడిగా ఉన్నానని, కోల్‌కతాలోని అనేక ముస్లిం స్వచ్ఛంద సంస్థల బోర్డులో కూడా ఉన్నానని అన్నారు. సామాజిక సేవకు గాను తాను అనేక పురస్కారాలు పొందానని అన్నారు. ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఇచ్చారని చెప్పారు. బౌబజార్‌లోని సెయింట్ స్టీఫెన్స్ తమ పాఠశాలలో 500మందికి పైగా నిరుపేద విద్యార్థులు చదువుతున్నారని అన్నారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ సమస్యాత్మకమైనది మాత్రమే కాదని, ఇది తీవ్ర విభజనను సృష్టిస్తోందని అన్నారు. నిర్దిష్ట కమ్యూనిటీ పట్ల పక్షపాతాన్ని స్పష్టంగా చూపుతోందని అన్నారు. స్వాతంత్య్రం అనంతరం తమ పూర్వీకులు పాకిస్తాన్‌ను కాదని భారత్‌ను ఎంచుకున్నారని అన్నారు. వారు 1918లో బీహార్‌లోని సివాన్ నుండి కోల్‌కతాకు వచ్చి స్థిరపడ్డారని అన్నారు. మెరుగైన జీవనోపాధి కోసం బీహార్ నుండి కోల్‌కతాకు వచ్చిన పలువురికి తమ నివాసం ఆశ్రయం ఇచ్చిందని అన్నారు. తన ప్రజాస్వామ్య హక్కును పునరుద్ధరణ కోసం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.



