నవతెలంగాణ- ఆర్మూర్
ఆలూరు మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ తెరాసకు చెందిన కల్లడి, డికంపల్లి గ్రామాల నాయకులు సొంతి రమేష్, అభిలాష్ ఆధ్వర్యంలో బుధవారం జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వరి కోతలు ప్రారంభమై ఇప్పటికే 20 రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు తెచ్చిన ధాన్యం ఎండలో ఎండిపోవడంతో పాటు వానలకు తడిసి నష్టపోతున్నదని తెలిపారు.
అలాగే, ధాన్యాన్ని భద్రపరచడానికి సరైన గిడ్డంగులు లేకపోవడంతో రైతులు రోడ్లపైనే ధాన్యం పోసి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాత్రింబవళ్లు ధాన్యానికి కాపలా కాస్తూ కుటుంబాలతో కలిసి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అనేక చోట్ల ధాన్యం రోడ్లపైనే ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామాల వారీగా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో అభిలాష్, రమేష్, రవి, యూనిస్, రాజు తదితరులు పాల్గొన్నారు.



