Thursday, April 9, 2026
E-PAPER
Homeకరీంనగర్తెలంగాణ రాజకీయాల్లో సంచలనం 

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం 

- Advertisement -

– కాసేపట్లో మాజీ మంత్రితో కేటీఆర్ భేటీ 
– బీఆర్ఎస్ లోకి ఆహ్వానించే అవకాశం 
నవతెలంగాణ – జగిత్యాల టౌన్ 

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలకపరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడానికి కేటీఆర్ హైదరాబాద్ నుండి జగిత్యాలకు బయలుదేరారు.
జిల్లాలో ఘన స్వాగతం.. భారీ బైక్ ర్యాలీ
కేటీఆర్ జగిత్యాల రాకను పురస్కరించుకుని నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. జగిత్యాల శివారులో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి వందలాది బైక్లతో భారీ ర్యాలీగా కేటీఆర్ ను జీవన్ రెడ్డి నివాసానికి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు సిద్ధమయ్యారు. కేటీఆర్ రాకతో జగిత్యాల పట్టణమంతా గులాబీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయి గులాబీమయంగా మారింది. అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించేందుకే కేటీఆర్ ఈ పర్యటన చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్ ఆయనతో ఫోన్ లో చర్చలు జరపగా, నేడు ప్రత్యక్షంగా భేటీ అయి పార్టీలోకి అధికారికంగా ఆహ్వానించనున్నారు. ఈ భేటీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కు చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా పాల్గొననున్నారు.
ముగిసిన నిరీక్షణ.. కేడర్ లో ఉత్సాహం…
సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే వార్తలతో జిల్లాలోని గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జీవన్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించగా, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏప్రిల్ 13న కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి అధికారికంగా గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
గొంతులో పడనున్న ఎలక్కాయా..
అనుకున్నట్లుగానే అన్ని సవ్యంగా జరిగినట్లయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి చేరనున్నారు. భవిష్యత్తులో జగిత్యాల నియోజకవర్గ టికెట్ ఆయనకే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే జరిగితే మొన్నటి వరకు టికెట్టు కోసం ఆశపడ్డ చోటా మోటా నాయకులకు గొంతులో ఎలక్కాయా పడనుందని ఆ పార్టీ శ్రేణులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి. జీవన్ రెడ్డి అవినీతి ఆరోపణలకు దూరంగా ఉన్న నాయకుడిగా పేరు పొందారు. ఇదే జరిగితే కొంతమంది నాయకులు ఆ పార్టీ నుండి వెళ్లిపోయే అవకాశాలు కలగనున్నాయి.

కొండగట్టు ప్రమాదం
కొండగట్టు ప్రమాదంలో అంత మంది చనిపోతే కనీసం పరామర్శించడానికి రాని కేటీఆర్ నేడు  అధికారం కోల్పోయిన తర్వాత మాజీ మంత్రి జీవన్ రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించడానికి జగిత్యాలకు రావడంపై కొండగట్టు బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -