Thursday, April 9, 2026
E-PAPER
Homeఖమ్మంఇంటర్ విద్యార్థులకు జూన్ నుంచి మధ్యాహ్న భోజనం: భట్టి

ఇంటర్ విద్యార్థులకు జూన్ నుంచి మధ్యాహ్న భోజనం: భట్టి

- Advertisement -

నవతెలంగాణ – బోనకల్ 
అక్షరమే ఆయుధంగా మలుచుకొని తెలంగాణ బిడ్డలు చదువుకొని బాగా ఎదగాలని, ఏ ఆయుధం తెలంగాణ బిడ్డలను నిలబెట్టలేదని, కేవలం అక్షరం ద్వారానే సమ సమాజం, అంతరాలు లేని ఆదర్శ సమాజం సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బోనకల్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా సైకిళ్ల ను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ద్వారా కూడా స్పష్టమైనట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డ అర్ధాకలితో బడికి పోకూడదని, అర్ధాకలితో బడికి పోయిన విద్యార్థి సరిగా పాఠాలను అర్థం చేసుకోలేడని, చదువుపై ఏకాగ్రత చూపలేడని, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు విద్యార్థుల మనసుకు ఎక్కవని తెలిపారు.


ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 20 లక్షల మంది విద్యార్థులకు రానున్న జూన్ రెండు నుంచి అల్పాహార పథకం ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు తెలిపారు. విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతుందని, ఈ పెట్టుబడి ఏది వృధా కాకూడదని ఆయన కోరారు.  రాష్ట్రంలో పుట్టిన ప్రతిబిడ్డ తాను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు సౌకర్యాలు కల్పించాలని, అద్భుతమైన మానవ వనరులుగా మన విద్యార్థులను తీర్చిదిద్దాలని విద్యాశాఖను చూస్తున్న సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి వారికి కావలసిన సౌకర్యాలన్ని కల్పిద్దామని తనతో స్పష్టం చేశారని డిప్యూటీ సీఎం తెలిపారు.

రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి ఆర్థిక వసతులు లేక, తల్లిదండ్రులు సహాయం చేయక చదువుకోలేకపోయాం అనే బాధ రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డకు ఉండకూడదనే కార్పొరేట్ వసతులతో కూడిన విద్యను రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ రాష్ట్రం బాగుపడాలని కోరి కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం అయితే దురదృష్టవశాత్తు గత పది సంవత్సరాలపాటు అధికారంలో ఉన్నవారు సమృద్ధిగా ఉన్న రాష్ట్ర వనరులను దేనికోసం ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టకపోవడంతో రాష్ట్రం దోపిడీకి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పుట్టిన బిడ్డలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో విద్యను బోధించేందుకు రాష్ట్రంలో ఒకేసారి 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. ప్రతి పాఠశాలను 100 కోట్ల పెట్టుబడితో 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇంగ్లీష్ మీడియం లో బోధన, క్రీడా సౌకర్యాలు, డిజిటల్ బోధన పరికరాలు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అక్కడే ఉండేలా క్వార్టర్లు సైతం నిర్మిస్తున్నామని వివరించారు. 

అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట చదువుకొని ఒక వసుదైక కుటుంబ భావన ఏర్పాటు చేసేందుకు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు.విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఆలోచనలను అర్థం చేసుకొని సహకరించాలని డిప్యూటీ సీఎం కోరారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తోపాటు రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రతి నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. మొత్తం 119 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మిస్తున్నాం, సెమీ రెసిడెన్షియల్ విధానంలో ఈ పాఠశాలలు కొనసాగుతాయని తెలిపారు. 

గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు కూలీ నాలి చేసుకుని వచ్చిన సంపాదనతో గ్రామానికి వచ్చే ప్రైవేటు పాఠశాల బస్సులో తమ పిల్లలను రెడీ చేసి పంపుతున్నారని, వారు ఆర్థికంగా భారానికి గురవుతున్నారని ప్రభుత్వం గుర్తించి వారికి చేయూతను ఇచ్చేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ వాహనాలు ఉదయాన్నే గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకొని వస్తాయని తెలిపారు. విద్యార్థులు రాగానే వారికి అల్పాహారం ఉచితంగా అందిస్తాం, మధ్యలో వారంలో మూడు రోజులపాటు పాలు, మూడు రోజులు పాటు రాగి జావా వంటి పోషక పదార్థాలు అందిస్తామని తెలిపారు.  ఆ తర్వాత మధ్యాహ్న భోజనం విద్యాబుద్ధులు నేర్పడం, సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులను వారి ఇళ్ల వద్ద ఉచిత రవాణా సౌకర్యంతో దించి వస్తాయని తెలిపారు. 

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లో నాణ్యమైన పోషక ఆహారంతో పాటు, క్రీడా సౌకర్యాలు, కంప్యూటర్, డిజిటల్ ఎడ్యుకేషన్ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల కంటే ఉన్నతంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఉండబోతున్నాయని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలలకు పేద, మధ్యతరగతి వర్గాలు ఫీజుల పేరిట చేసే ఖర్చును ఆదా చేసి ఆయా కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి పరచడంతో పాటు పేద, మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. పిల్లలు బాగా చదువుకునేందుకు  ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తనకు తెలిసిన మిత్రులతో మాట్లాడి అమ్మ ఫౌండేషన్ ద్వారా మధిర నియోజకవర్గంలోని బోనకల్లు, ఎర్రుపాలెం మండలాల్లో ఈరోజు ఉచితంగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.

అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8, 9 ,10 తరగతుల, ఇంటర్మీడియట్ విద్యార్థిని- విద్యార్థులకు సైకిల్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జిల్లా అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ, ఖమ్మం ఆర్డీవో నక్క శ్రీనివాస్ రావు, కల్లూరు డిఎల్ పిఓ విజయలక్ష్మి, రాష్ట్ర గెడ్డంగుల సంస్థ కార్పొరేషన చైర్మన్ రాయల వెంకటేశ్వరరావు హస్తకాలల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు మధిర ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు డి ఐ ఈ ఓ కందుల రవిబాబు, ఏపీవో రామకృష్ణ, సీఎంఓ ప్రవీణ్ కుమార్, మండల తహసిల్దార్ మద్దెల రమాదేవి, ఎంపీడీవో రుణావత్ రమాదేవి, మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య, విద్యుత్తు ఏ డి ఏ యార్లగడ్డ వెంకట ఆనంద్ కుమార్, ఏ ఈ తోకల మనోహర్, ఏపిఎం కొట్టే వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ జిల్లా నాయకులు పైడిపల్లి కిషోర్ కుమార్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -