నవతెలంగాణ – హైదరాబాద్: మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అస్సాంలో మధ్యాహ్నం 3 గంటల సమయానికి 75.91% ఓటింగ్ నమోదైంది. కేరళంలో 62.71% ఓటింగ్ నమోదైంది. పుదుచ్చేరిలో 72.40% ఓటింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
పుదుచ్చేరిలోని మన్నడిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్ వద్ద బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. తిరుకనూర్ గ్రామంలోని ఒక పోలింగ్ బూత్ సమీపంలో బీజేపీ కార్యకర్తల బృందం నిలబడి ఉంది. అక్కడ ఓటర్లు మాత్రమే ఉండేందుకు అనుమతి ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. దీంతో వాగ్వాదం జరిగి, తోపులాటకు దారి తీసింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
వర్షాన్ని సైతం లెక్క చేయని ఓటర్లు
ఆకాశం మేఘావృతమై, అడపాదడపా వర్షం కురుస్తున్నప్పటికీ, అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తొలిసారి ఓటు వేస్తున్న వారి నుండి వృద్ధుల వరకు, అన్ని వయసుల వారిలో ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా, గౌహతితో సహా కొన్ని చోట్ల ఉదయం నుండి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అయినప్పటికీ, వాతావరణం ఓటింగ్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు. జోర్హాట్, కామరూప్, కోక్రాఝర్, లఖింపూర్ వంటి జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల బయట పొడవైన క్యూలు కనిపించాయి. 126 స్థానాలున్న ఈ శాసనసభకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.



