నవతెలంగాణ-జక్రాన్‌పల్లి: రహదారులపై ఎవరైనా వరి ధాన్యం ఆరబోస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మహేష్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది రైతులు మొక్కజొన్న, వరి వంటి ధాన్యాలను ఆరబెట్టడానికి ప్రధాన రహదారులు, సర్వీస్ రోడ్లపై వాడుకుంటున్నారని, ద్విచక్ర వాహనాలకు, ఆటో రిక్షాలకు ప్రమాదానికి గురై ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. నల్లగుట్ట తండాకు చెందిన గుగ్లోత్ పరమేశ్ అనే వ్యక్తి తన గ్రామం నుండి అర్గుల్ వైపు వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా, అర్గుల్ నుండి మునిపల్లి వైపు వస్తున్న ఒక ఆటో రిక్షా డ్రైవర్ రోడ్డుపై ఉన్న మొక్కజొన్న ధాన్యాల కారణంగా.. నియంత్రణ కోల్పోయి రెండు వాహనాలు ఢీకొన్నాయన్నారు. ఈ ఘటనపై ఆటో డ్రైవర్‌తో పాటు రోడ్డుపై మొక్కజొన్న ధాన్యాలను పోసిన రైతుపై కూడా కేసు నమోదు చేశామని తెలియజేశారు. పంటల ఆరబోతకు రహదారులను వినియోగించడం మానేయాలని ఆయన చెప్పారు.



