నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో గల బృందావన్ సమీపంలో శుక్రవారం ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. యమునా నదిలోని కేషీఘాట్ వద్ద సుమారు 25 నుంచి 30 మంది భక్తులతో వెళ్తున్న పడవ అకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించగా, మరికొందరు గల్లంతైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో నీటిలో మునిగిపోతున్న 14 మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా బయటకు తీశాయి. అయితే, మరో 10 నుంచి 12 మంది వరకు నీటిలో గల్లంతై ఉంటారని అంచనా వేస్తున్నారు.
జిల్లా అధికారుల కథనం ప్రకారం.. పంజాబ్ నుంచి వచ్చిన యాత్రికుల బృందం యమునా నదిలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటమే కాకుండా.. బృందావన్ వద్ద ఉన్న పాంటూన్ వంతెన సమీపంలో పడవ నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు మరియు విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.


