Thursday, August 27, 2026
E-PAPER
Homeమానవిఅన్నయ్య అంటే ఓ భరోసా

అన్నయ్య అంటే ఓ భరోసా

- Advertisement -

డా.ఎర్ర భవాని… కళలంటే అమితమైన ఆసక్తి కనబరిచే ఈమె నేడు అందరికీ అభినందన భవానీగా సుపరిచితులు. నలభై ఏండ్ల కిందట ‘అభినందన’ అనే ఓ సాంస్కృతిక సంస్థను స్థాపించారు. ఇలాంటి ఓ సంస్థను స్థాపించిన మొదటి మహిళగా ఆనాడు చరిత్ర సృష్టించారు. అభినందన ఆధ్వర్యంలో అనేక సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎందరో కళాకారులకు గుర్తింపును తీసుకొచ్చారు. మరీ ముఖ్యంగా ఈ సంస్థలో 30 మందికి పైగా మహిళలు సభ్యులుగా ఉండి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతే కాదు ‘అప్నాఘర్‌’ ‌పేరిట బాలుర కొరకు ఓ అనాధ శరణాలయాన్ని స్థాపించి కరోనా ముందు వరకు నడిపించారు. ఎన్ని ఆటుపోటులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో అభినందన సంస్థను ముందుకు తీసుకెళుతున్న ఆమె సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కీర్తి పురస్కారంతో సత్కరించింది. ఈరోజు తాను ఈ స్థాయిలో నిలబడటానికి కారణం తన అన్నలే అంటూ గర్వంగా చెబుతున్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఆమె ఈ రాఖీ పండుగ సందర్భంగా అన్నలతో తన అనుబంధాన్ని మానవితో ఇలా పంచుకున్నారు.

మాది ఖమ్మం జిల్లాలోని వేంసూర్‌ గ్రామం. అమ్మ వరలక్ష్మి, నాన్న మాదిరాజు శ్రీనివాస్ రావు. వారికి మేము ఏడుగురు పిల్లలం. అయిదుగురు అబ్బాయిలు, ఇద్దరం అమ్మాయిలం. నేను ఐదవదాన్ని. నాకు నలుగురు అన్నలు, ఒక తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. అన్నయ్య అనే పదంలోనే ఎంతో ఆపేక్ష, ఆత్మీయత ఉంది. అమ్మ అనే పదంలోని అ, నాన్న అనే పదంలోని నా కలిపితే అన్న. వినటానికి ఎంతో బాగుంటుంది కదా! నాకు మా నలుగురు అన్నయ్యలతో, తమ్ముడితో మంచి అనుబంధం ఉంది. పెద్దన్నయ్య స్కూల్ హెడ్ మాస్టర్‌గా చేసేవాడు. నేను ఈ రోజు అభినందన భవానిగా గుర్తింపు పొందానంటే దాని వెనుక అన్నయ్య ప్రోత్సహం ఎంతో ఉంది. నా ఎనిమదవ ఏట నుండి డ్రామాలు వేయడం, పాటలు పాడటం, ఆటలు ఆడటం మొదలైన వాటిల్లో ఎక్కువ పాల్గొనడానికి కారణం పెద్దన్నయ్యే కారణం.

అన్నయ్యే జడ వేసేవాడు
మా రెండో అన్నయ్య డాక్టర్ కావడం వల్ల చదువు నిమిత్తం మాకు కాస్త దూరంగా ఉండేవాడు. కానీ తను ఎక్కడికి వెళ్లినా ‘ఇవి మా చెల్లికి ఎంత బాగుంటాయో’ అని కొని తెచ్చేవాడు. ఇక మూడవ అన్నయ్యతో అనుబంధం చాలా చాలా ఎక్కువ. తాను విలేజ్ అసిస్టెంట్‌గా చేసేవాడు. ఏది కావాలన్నా క్షణాల్లో తెచ్చి ఇచ్చేవాడు. అన్నయ్య నాకు గాజులు కావాలంటే… మాది బాగా పల్లెటూరు. పెద్దగా ఏమీ దొరికేవి కావు. దాంతో పక్క ఊరికి వెళ్లి తెచ్చేవాడు. పూలు కావాలంటే చెట్టు ఎక్కి పూలు కోసి ఇచ్చేవాడు. మా అన్నయ్యల దృష్టిలో నేను సౌందర్య రాసిని. అప్పట్లో నాకు ఏ సంబంధం వచ్చినా ‘ఇతను మా చెల్లికి సరి జోడి కాదు’ అంటూ తిప్పి పంపించేవారు. అమ్మ పాతకాలం వారు అవడం వల్ల కొన్ని కట్టుబాట్లు, ఆంక్షలు ఉండేవి. ఇంట్లోకి రాలేని రోజుల్లో మా పెద్ద అన్నయ్య జడ వేడేవాడు, అన్నం కలిపి ముద్దలు చేసి తినిపించేవాడు. ఇలా నన్ను అమ్మలా చూసుకునేవాడు.

పూలతో రాఖీ కట్టేదాన్ని
రాఖీ పండగ గురించి చెప్పాలంటే మాది శుద్ధ పల్లెటూరు అని చెప్పాను కదా! ఏమీ దొరికేవి కావు, కానీ రాఖీ పండుగకు అన్న దమ్ములకు రాఖీ కట్టాలి అనే తపన ఉండేది. అప్పుడు పూలు కోసుకొచ్చి దాన్ని మాల కట్టి, రాఖీ లాగా వారి చేతికి కట్టి సంబరపడేదాన్ని. నేను ఎంతో గారాబంగా పెరిగాను. నాన్న నా చిన్నతనంలోనే పోవడం వల్ల అన్నయ్యల ప్రేమా, ఆప్యాయతల మధ్య పెరిగాను. ఈత కొట్టడం, చెట్లు ఎక్కడం, సైకిల్ తొక్కడం ఇవన్నీ అన్నయ్యలే నేర్పించారు. అన్నయ్యల స్నేహితులు అందరూ నాకూ స్నేహితులే. వాళ్లంతా కూడా నన్ను చెల్లెమ్మ అంటూ ఎంతో అభిమానంగా చూసుకునేవారు. ఇక తమ్ముడుకి నాయకత్వపు లక్షణాలు ఎక్కువ. నేను అన్నయ్యల ప్రేమ ఎంత పొందానో, అలాగే తమ్ముడు పట్ల నేను అంతే ప్రేమ చూపించేదాన్ని. తనూ నాకు ఎంతో గౌరవం ఇచ్చేవాడు. అన్నయ్య అంటే అండడా దండ. ఒక ధైర్యం. అన్నయ్య అంటే ఒక భరోసా.

బుజ్మమ్మా అని పిలుస్తారు
నాకు 16 ఏండ్ల వయసు వచ్చేసారి పెండ్లి చేశారు. మా వారు చాలా అందగాడు. పెళ్లి కాగానే నేను హైదరాబాద్ వచ్చేసాను. పెళ్లి అయ్యి అత్తారింటికి వచ్చినా కూడా మా అనుబంధం అలాగే కొనసాగుతుంది. మా రెండో అన్నయ్య నా పెండ్లి తర్వాత తాను ఇంటికి ఏది కొనుక్కోంటే అది నాకు కొని తెచ్చేవాడు. తాను డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కుంటూ మా బుజ్జమ్మకి(నన్ను ఇంట్లో అందరూ బుజ్జమ్మ అంటారు)డ్రెస్సింగ్ టేబుల్ లేదు కదా అంటూ కొని తెచ్చేశాడు. వదినకు ఏది కొంటే నాకూ అది కొనేవాడు. నేను ఎండాకాలంలో ప్రతీ ఏడాది పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేదాన్ని. నేను వస్తున్నాను అనగానే అన్నయ్యలు, వారి పిల్లలు పొద్దున్నే బస్‌స్టాండ్‌కి వచ్చి కూర్చునేవారు. సత్తుపల్లి నుండి మా ఊరు 8 కిలో మీటర్లు. పిల్లలతో అంత దూరం వెళ్లడం కష్టం కదా! అందుకే ‘అత్తయ్య వస్తోంది’ అని అన్నయ్య పిల్లలు, ‘బుజ్జమ్మ వస్తోంది’ అని అన్నయ్యలు బస్ స్టాండ్‌లో పడి గాపులు కాసేవారు. ఇలా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఎన్నని చెప్పను? ఇక మా మూడో అన్నయ్య అయితే మా తోటలో ఏ పండు కాసినా ‘ముందు మా బుజ్జమ్మ తినాలి’ అంటూ కోసి తెచ్చేవాడు. నాకు పూలంటే చాలా ఇష్టం. ప్రతి రోజు పూలు పెట్టుకునే దాన్ని. ఒక సారి నాకు పున్నాగ పూలంటే ఇష్టమని మా మూడో అన్నయ్య చెట్టు ఎక్కి కింద పడి చేయి విరగ్గొట్టుకున్నాడు. నా కోసం మా అన్నయ్యలు ఎన్ని త్యాగాలు చేశారో చెప్పలేను.

ఈత కొట్టడం, చెట్లు ఎక్కడం, సైకిల్ తొక్కడం ఇవన్నీ అన్నయ్యలే నేర్పించారు. అన్నయ్యల స్నేహితులు అందరూ నాకూ స్నేహితులే. వాళ్లంతా కూడా నన్ను చెల్లెమ్మ అంటూ ఎంతో అభిమానంగా చూసుకునేవారు. ఇక తమ్ముడుకి నాయకత్వపు లక్షణాలు ఎక్కువ.

పూలు కోసుక్కొచ్చి దాన్ని మాల కట్టి, రాఖీ లాగా వారి చేతికి కట్టి సంబరపడేదాన్ని. నేను ఎంతో గారాబంగా పెరిగాను. నాన్న నా చిన్నతనంలోనే పోవడం వల్ల అన్నయ్యల ప్రేమా, ఆప్యాయతల మధ్య పెరిగాను.

– పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -