Monday, April 13, 2026
E-PAPER
Homeజిల్లాలునత్తనడకన చౌటుప్పల్‌ ఫ్లైఓవర్ పనులు

నత్తనడకన చౌటుప్పల్‌ ఫ్లైఓవర్ పనులు

- Advertisement -
  • ట్రాఫిక్‌తో ప్రజలకు నరకయాతన

నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్: చౌటుప్పల్ పట్టణంలో కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శనివారం,ఆదివారం వంటి సెలవు దినాల్లో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగి పట్టణం మొత్తం ట్రాఫిక్ సమస్యలతో స్తంభించిపోతుంది. పట్టణంలోని ప్రధాన మార్గాలు మూసివేతకు గురవ్వడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది.

మొన్నటి వరకు వలిగొండ రోడ్, బస్టాండ్ ప్రాంతం, తంగడపల్లి రోడ్ పూర్తిగా మూసివేయడంతో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి పెద్ద ఎత్తున మళ్లింపు మార్గాలను వినియోగించాల్సి వస్తోంది.తంగడపల్లి రోడ్ నుంచి బస్టాండ్‌కు వెళ్లాలంటే వలిగొండ రోడ్ మీదుగా చుట్టూ తిరగాల్సి రావడం లేదా లక్కారం ఫ్లైఓవర్ కింద నుంచి ప్రయాణించాల్సి వస్తోంది. ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.రోడ్డుకు రెండు వైపులా ఉన్న డ్రైనేజీ మోరిలపై ప్రయాణించాల్సి వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షం వచ్చినా పరిస్థితి మరింత విషమంగా మారుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫ్లైఓవర్ పనులు ఈ విధంగా నెమ్మదిగా కొనసాగితే పూర్తవడానికి ఇంకా మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యల కారణంగా చౌటుప్పల్ ప్రాంతానికి రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు చెబుతున్నారు.ఇప్పటికైనా జాతీయ రహదారుల సంస్థ అధికారులు, మున్సిపాలిటీ,పోలీస్ శాఖలు సమన్వయం చేసుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ట్రాఫిక్ నియంత్రణకు తగిన ఏర్పాట్లు చేసి,ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.పట్టణ అభివృద్ధి కోసం చేపట్టిన ఫ్లైఓవర్ పనులు ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా మారకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Chautauqua flyover works in progress
Chautauqua flyover works in progress
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -