నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్‌ఎస్‌ను మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్పు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తమకు పొత్తులతో కలిసిరాదని, కుదరదని వ్యాఖ్యానించారు. గతంలో తాము కొన్ని చిన్నచిన్న తప్పులు చేశామని తెలిపారు. అప్పుడు ప్రజలకు నాయకులకు మధ్య దూరం పెరిగిందని, గతంలో జరిగిన తప్పులపై అధ్యయనం చేశామని అన్నారు. లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. ఈసారి వచ్చేది బీఆర్‌ఎస్సేనని.. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. అన్ని పథకాల్లో కాంగ్రెస్ విఫలమైందన్నారు.
కాగా ఈ నెల 25వ తేదీన పార్టీని ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన కవిత తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితిగా పరిశీలిస్తున్నట్లు చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. “పాత పేరు, కొత్త జెండా, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తాను” అని ఆమె చెప్పడం ఈ చర్చకు మరింత బలాన్నిచ్చింది. దీంతో తెలంగాణ సెంటిమెంట్‌తో మమేకమైన పేరును కవిత సొంతం చేసుకుంటే .. దాని ప్రభావం బీఆర్ఎస్‌పై ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపద్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.



