నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన కాంకేర్ జిల్లాలో భద్రతా దళాలు మరోసారి భారీ కూబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ నక్సల్ ఏరియా కమాండర్ ‘రూపి’ అలియాస్ రంగబోయిన భాగ్య మృతి చెందారు. ప్రభుత్వం ఆమెపై గతంలోనే రూ. 5 లక్షల రివార్డు ప్రకటించింది. చోటే బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏరియా కమాండర్ రూపి అక్కడికక్కడే మరణించింది.
కాల్పుల అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, రూపి మృతదేహంతో పాటు ఆమె వద్ద ఉన్న ఒక ఆటోమెటిక్ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు కాన్కేర్ ఎస్పీ నిఖిల్ రాఖేచా వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్ తర్వాత ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. మాచ్‌పల్లి అడవుల్లో ఇంకా 10 మంది వరకు మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో, వారిని పట్టుకునేందుకు అదనపు బలగాలు రంగంలోకి దిగాయి.



