నవతెలంగాణ-హైదరాబాద్ : ఓ ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న యాత్రికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. వారిలో ఆరుగురు యాత్రికులు కాగా.. మరో వ్యక్తి రోడ్డు పక్కన తన వాహనం టైరు మారుస్తున్న డంపర్ డ్రైవర్. యాత్రికులు రాజ్‌కోట్‌లోని గద్కా గ్రామం నుంచి దేకావాలాలోని మహదేవ్ ఆలయానికి వెళ్తుండగా.. సోమవారం తెల్లవారుజామున లఖ్తర్-విరామ్‌గామ్ రహదారిపై భాస్కర్‌పారా సమీపంలో ప్రమాదం జరిగింది.
రాజ్‌కోట్‌లోని గధ్కా గ్రామం నుంచి దేకావాలాలోని మహాదేవ్ ఆలయానికి నడుచుకుంటూ వెళ్తున్న యాత్రికులు.. మార్గమధ్యలో భాస్కర్‌పారా సమీపంలో ఓ వ్యక్తి రోడ్డుపై ఆగిపోయిన డంపర్‌కు టైరు మారుస్తున్నాడు. యాత్రికులు ఆ డంపర్‌ను దాటుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. అదేవిధంగా డంపర్ టైరు మారుస్తున్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
దాంతో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



