నవతెలంగాణ కంఠేశ్వర్
తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా, ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ అధ్యక్షులు ప్రొఫెసర్ డా. విశాల్ ఆకుల, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ( ఐపీఎస్) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వారు అడిక్షన్ మెడిసిన్ – స్పెషాలిటీ సెక్షన్ చైర్మన్ గా నియమించారు. మానసిక వైద్యంలో, ముఖ్యంగా వ్యసన సంబంధిత రుగ్మతల చికిత్సలో ఆయనకు ఉన్న విశేష అనుభవం, నైపుణ్యం మరియు సేవలను గుర్తిస్తూ ఈ బాధ్యతను అప్పగించారు. డా. విశాల్ ఆకుల గత ఎన్నో సంవత్సరాలుగా డీ-అడిక్షన్ సేవలు, ప్రజా అవగాహన కార్యక్రమాలు, మరియు మానసిక ఆరోగ్యంపై విద్యా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ అనేకమంది రోగులకు సేవలు అందిస్తున్నారు. ఆయన నిర్వహిస్తున్న డీ-అడిక్షన్ సెంటర్ ద్వారా వందలాది మంది వ్యసన బాధితులు చికిత్స పొందుతూ సమాజంలో తిరిగి స్థిరపడుతున్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ లోని అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ దేశవ్యాప్తంగా వ్యసన వ్యాధులపై అవగాహన పెంపొందించడం, చికిత్స మార్గదర్శకాలు రూపొందించడం, పరిశోధనలకు ప్రోత్సాహం అందించడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది.
ఈ సందర్భంగా వైద్య వర్గాలు, సహచరులు డా. విశాల్ ఆకుల ని అభినందిస్తూ, ఆయన నాయకత్వంలో దేశవ్యాప్తంగా అడిక్షన్ మెడిసిన్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షులు డా. టి. సత్యనారాయణ రావు, ప్రధాన కార్యదర్శి డా. అరుణ్ మార్వాలే గారు, డా. విశాల్ ఆకుల ని ఏప్రిల్ 18, 2026న రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో నిర్వహించనున్న నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డా. విశాల్ ఆకుల మాట్లాడుతూ. దేశంలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగం ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారిందని, దీనిపై జాతీయ స్థాయిలో కార్యాచరణ ప్రణాళికను జైపూర్ సమావేశంలో సమర్పించనున్నట్లు తెలిపారు.అలాగే, పాఠశాల స్థాయిలోనే మత్తు పదార్థాల నివారణ మరియు దుష్ప్రభావాలపై ఒక ప్రత్యేక అధ్యాయాన్ని హైస్కూల్ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని భారత ప్రభుత్వం వద్ద ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ద్వారా ప్రతిపాదించనున్నట్లు వెల్లడించారు. యువతను వ్యసనాల నుండి కాపాడడం సమాజం మొత్తం బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.



