Wednesday, September 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దమ్ముంటే రా.. పరకాల అభివృద్ధిపై చర్చకు రావాలి...

దమ్ముంటే రా.. పరకాల అభివృద్ధిపై చర్చకు రావాలి…

- Advertisement -

– హామీల లెక్కలు తేల్చుకుందాం.. ప్రజలకు సమాధానం చెప్పు: మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ -పరకాల : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హామీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు వివరించేందుకు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మంగళవారం పరకాలలో ఆయన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.పరకాల అంబేద్కర్‌ సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సూచించే ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ, మార్గమధ్యంలో వ్యాపారులు, ప్రజలకు పార్టీ కరపత్రాలు, బాకీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఓల్డ్‌ ఏటీఎం సెంటర్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. సీఎం డౌన్‌ డౌన్‌, హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌ ప్రభుత్వం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. బాకీ కార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. అనంతరం ర్యాలీగా బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకుని కార్యక్రమాన్ని ముగించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. “కేసీఆర్‌ బయటకు వస్తే మీ ఆటలు సాగవు. నువ్వు ఏం చేస్తున్నావ్‌? ఏం హామీలు ఇచ్చినావో ప్రజలు లెక్కలు తీస్తున్నారు బిడ్డా” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వృద్ధులు, పేదలు, మహిళలు, బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెన్షన్‌ పెంపు, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం వంటి హామీలను నెరవేర్చాలని కోరారు. కల్యాణలక్ష్మి పథకానికి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు.పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ధర్మారెడ్డి డిమాండ్‌ చేశారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని, పాలిటెక్నిక్‌ కళాశాలలు, సాంకేతిక విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.రైతులకు యూరియా అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “రైతులకు యూరియా లేదు.. సోయి లేదు.. సిగ్గు లేదా? రైతులు వ్యవసాయం చేసుకోవాలా? లేక యూరియా కోసం తిరగాలా?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవైపు ఎరువుల కొరత, మరోవైపు సాగునీటి సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.కాలువలకు నీరు రావడం లేదని, బావుల్లో నీరు లేక అనేక ప్రాంతాల్లో నాట్లు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. ఇంకా పలుచోట్ల నాట్లు ప్రారంభం కాలేదన్నారు. గ్రామాల్లో తాగునీటి కొరత నెలకొందని, విద్యుత్‌ సరఫరా పరిస్థితి కూడా సరిగా లేదని విమర్శించారు. చెరువులు, కాలువల్లో నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

గతంలో వర్షాకాలంలో చెరువులు నిండిపోయి మత్తళ్లు పోసే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుతం చెరువులు, కాలువల్లో నీరు లేకపోవడానికి కారణమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు భరోసా, పంటల బోనస్‌ తదితర హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

పరకాల నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ధర్మారెడ్డి ఆరోపించారు. “పరకాల నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారో చర్చకు రా.. దమ్ముంటే నిరూపించు” అంటూ అధికారపక్ష నాయకులకు సవాల్‌ విసిరారు. పరకాల అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.ప్రజా సమస్యలపై స్పందించాల్సిన నాయకులు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ పార్టీ అంతర్గత పంచాయతీలను చక్కదిద్దుకునే పనిలో ఉన్నారని విమర్శించారు. “ప్రజల కోసం ఢిల్లీ వెళ్తున్నారా? లేక మీ పార్టీ పంచాయతీలు తీర్చుకోవడానికి వెళ్తున్నారా?” అంటూ ప్రశ్నించారు.

ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుంది
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాట కార్యక్రమాలు చేపడుతున్నామని ధర్మారెడ్డి తెలిపారు. ప్రజల కష్టాల్లో భాగస్వాములై, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.కేసీఆర్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న డిమాండ్‌ను ఆయన తప్పుబట్టారు. తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్‌ ఆదేశాల మేరకే తాము ప్రజా సమస్యలపై రోడ్డెక్కి పోరాడుతున్నామని తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని, రైతులు, విద్యార్థులు, మహిళలు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. హామీలను అమలు చేయకుండా ఇదే విధానాన్ని కొనసాగిస్తే రానున్న రోజుల్లో ప్రజలే ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని ధర్మారెడ్డి హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి, బొచ్చు స్యామల బాబురావు,కొక్కిరాల రాకేష్ రావు, బిఆర్ఎస్ నాయకులు బండి సారంగపాణి,దుంపేటి నాగరాజు,పరకాల నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సుమారు 150 మంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -