– భద్రత లేదు- బడ్జెట్ కేటాయింపులు లేవు
– ఖాళీలు భర్తీ చేయకుండా, పోస్టుల్ని రద్దు చేస్తున్న వైనం
– ప్రజలకు ఇచ్చే రాయితీలన్నీ రద్దు చేసిన మోడీ సర్కార్
– రైలు ప్రమాదాల్లో మరణిస్తున్న సామాన్యులు, రైల్వే ఉద్యోగులు
– ప్రజలతో కలిసి ఐక్య ఉద్యమాలకు కార్యాచరణ : సీఐటీయూ సదస్సులో జాతీయ అధ్యక్షులు కే హేమలత
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఐటీయూ జాతీయ అధ్యక్షులు కే హేమలత అన్నారు. కానీ మోడీ సర్కార్ అందుకు భిన్నంగా రైలు ప్రమాదాలకు ఉద్యోగులను బాధ్యులను చేస్తూ, వారిపై దుష్ప్రచారం చేస్తూ, క్రమశిక్షణ పేరుతో చర్యలు తీసుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా రైలు ప్రమాదాల్లో వందల సంఖ్యలో ప్రయాణీకులు మరణిస్తున్నారనీ, వారిలో అత్యధికులు వలస కూలీలే ఉంటున్నారని తెలిపారు. 2016 నుంచి 2022 మధ్య కాలంలో జరిగిన రైలు ప్రమాదాల్లో 450 మంది ట్రాక్మెన్లు కూడా మరణించారని గుర్తుచేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ అధ్యర్యంలో సోమవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రైల్వే సేఫ్టీకి ప్రధాన్యత ఇవ్వాలి. ప్రజల ప్రాణాలు కాపాడాలి. ప్రయివేటీకరణ చర్యలు నిలుపుదల చేయాలి’ అంశంపై జరిగిన రాష్ట్ర సదస్సులో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను ఎత్తివేశారని గుర్తుచేశారు. అన్ని రంగాల మాదిరే రైల్వేను కూడా ప్రయివేటీకరించే చర్యలు వేగవంతం చేశారని చెప్పారు. ప్రజల సొమ్ముతో రైల్వే ట్రాక్‌లు, స్టేషన్లు నిర్మించి, నిర్వహణ పేరుతో వాటిని ప్రయివేటువారికి కట్టబెడుతున్నారని వివరించారు. సామాన్య ప్రయాణీకులకు రైలు ప్రయాణాన్ని దూరం చేస్తున్నారనీ, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి, వాటికే ఎక్స్‌ప్రెస్ రైళ్లు అని బోర్డులు తగిలించి, ప్రయాణీకులను ఆర్థిక దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. జనరల్, స్లీపర్ క్లాస్ బోగీలను తగ్గించి, ఏసీ బోగీల సంఖ్యను పెంచుతూ, సామాన్యులకు రైలు ప్రయాణాన్ని దూరం చేస్తున్నారని విశ్లేషించారు. దేశంలో ఏటా 4,500 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ పాతది అవుతున్నదనీ, వాటిని పునర్నిర్మించకుండా, ప్రయాణీకుల రైళ్లను తగ్గించి, సరుకు రవాణా పేరుతో గూడ్స్ రైళ్ళను పెంచి తిప్పుతున్నారని వివరించారు. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక 22 శాతం గూడ్స్ రైళ్లు పెరిగాయని గణాంకాలను వెల్లడించారు. ట్రాక్ రిపేర్ల కోసం రైల్వే ఉద్యోగులకు సమయం కూడా ఇవ్వట్లేదనీ, దీనివల్ల కూడా ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నదని తెలిపారు. ఈ విషయాలను ‘కాగ్’ కూడా తప్పుపట్టిందనీ, అయినా ప్రభుత్వ తీరులో ఎలాంటి మార్పు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకుంటూ, ట్రాక్‌లు, రైళ్లు, స్టేషన్లను ప్రయివేటుపరం చేస్తున్నదనీ, దానికోసం ప్రాంతాల వారీగా పనుల్ని విభజించి, కాంట్రాక్టులు ప్రయివేటు వ్యక్తులు, సంస్థలకు కట్టబెడుతున్నారని చెప్పారు. రైల్వే ప్రొడక్షన్ యూనిట్లకు పనులు ఇవ్వకుండా మూసివేస్తున్నారనీ, ఆ స్థానంలో బహుళజాతి ప్రయివేటు సంస్థలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.
పేరుకే మేకిన్ ఇండియా అనీ, రైల్వేకు సంబంధించిన అన్ని ఉపకరణాలను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నారని తెలిపారు. రైల్వేల ప్రయిటీకరణ వల్ల ప్రజా ప్రయోజనాలు నెరవేరిన దాఖలాలు లేవనీ, అర్జెంటీనా, ఆస్ట్రేలియాల్లో ఇది రుజువై, తిరిగి ప్రభుత్వమే ఆయా రూట్లను స్వాధీనం చేసుకున్నదని ఉదహరించారు. రైల్వేలో మూడు లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనీ, రిటైర్ అయిన వారి పోస్టుల్ని రద్దు చేస్తున్నారే తప్ప, భర్తీ చేయట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌ను సాకుగా చూపి, గతంలో రైల్వే మంత్రిత్వశాఖ వివిధ వర్గాల ప్రజలకు ఇస్తున్న రాయితీలను ఎత్తేశారనీ, వాటిని పునరుద్ధరించాలని కోరినా పట్టించుకోవట్లేదని చెప్పారు. రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రచారం చేస్తున్నారనీ, ప్రజల సొమ్ముతో ఆ పనులు చేపట్టి, నిర్వహణ పేరుతో స్టేషన్లకు స్టేషన్లనే ప్రయివేటుకు కట్టబెట్టే చర్యలు చేపడుతున్నారని పలు ఉదాహరణాలు వివరించారు. రైల్వే పరిరక్షణ కేవలం ఉద్యోగులకు సంబంధించినదే కాదనీ, ప్రజల్నీ మమేకం చేసి, వారితో కలిసి ఐక్య పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ఉపాధ్యక్షులు వీఎస్ రావు అధ్యక్షత వహించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ సదస్సులో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఆలిండియా రైల్వే ట్రాక్ మెయింటెనర్ యూనియన్ జనరల్ సెక్రటరీ అనంత్ కంబ్లే, ఆలిండియా గార్స్డ్ కౌన్సిల్ హైదరాబాద్ డివిజన్ కార్యదర్శి కృష్ణ, ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ దక్షిణ మధ్య రైల్వే జోనల్ ప్రధాన కార్యదర్శి జిలానీ, తెలంగాణ రైల్వే క్యాజువల్, కాంట్రాక్ట్ అండ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బీ మధు, ఆలిండియా రైల్వే రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నాయకులు కే శివకుమార్ తదితరులు మాట్లాడారు. అంతకుముందు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్ నాయకులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సదస్సు భవిష్యత్ కార్యాచరణకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
రైలు ప్రమాదాలకు కేంద్రానిదే బాధ్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES