విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి

స్టడీ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ పట్టణ పరిధి పెరిగి అభివద్ధి చెందుతుందని అందుకు అనుగుణంగా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి జిల్లా పరిషత్‌ ఆధ్వర్యంలో స్టడీ సెంటర్‌ను ప్రారంభించుకున్నట్లు విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. శనివారం నల్లగొండ మహిళా ప్రాంగణం సముదాయంలో డీపీఆర్‌సీ సెంటర్‌లో జిల్లా పరిషత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణ గ్రామీణ యువతి, యువకుల అవసరానికి అనుగుణంగా పై చదువులకు ఉపయోగపడే విధంగా ఈ అధ్యయన కేంద్రం నిలవాలన్నారు. స్టడీ సెంటర్‌ వినియోగించుకోవడానికి వచ్చిన యువతి, యువకులకు, చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుదూర ప్రాంతాల నుండి కళాశాలలకు వచ్చే విద్యార్థులకు అన్ని రకాలైన పుస్తకాలు స్టడీ మెటీరియల్‌ ఈ కేంద్రంలో అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్‌ వెలుబడగానే కోచింగ్‌ సెంటర్లకు వెళుతున్నారు. అది ఖర్చుతో కూడిన భారం కనుక ఆ భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా, మండల స్థాయిలో గ్రంథాలయాలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడకుండా పోటీ పరీక్షల కోసం ఈ స్టడీ సెంటర్‌ను నిరంతరం కొనసాగిస్తామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీకు ఇంకా ఏమైనా పుస్తకాలు కావాలంటే వెంటనే ఇండెంటును జిల్లా పరిషత్‌ సీఈఓకు సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్‌ ఛైర్మెన్‌ బండా నరేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్‌, శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి, రవీంద్ర నాయక్‌, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్‌, జెడ్పీ వైస్‌ చైర్మెన్‌ ఇరిగి పెద్దులు, జిల్లా కలెక్టర్‌ వినరు కష్ణారెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌ కరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love