Thursday, May 8, 2025
Homeఅంతర్జాతీయం26న పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలు

26న పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలు

- Advertisement -

– నేటి నుంచి ప్రజల సందర్శనార్ధం బసిలికాలో భౌతికకాయం
– అంత్యక్రియల్లోనూ ఆచారాలను ధిక్కరించి..
వాటికన్‌:
సోమవారం కన్నుమూసిన పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలు ఈ నెల 26న జరగనున్నాయి. బుధవారం నుంచి ఆయన భౌతిక కాయాన్ని సెయింట్‌ పీటర్స్‌ బసిలికాలో ప్రజల సందర్శనార్ధం వుంచనున్నట్లు వాటికన్‌ వర్గాలు తెలిపాయి. కాగా పోప్‌ అంత్యక్రియలకు పలు దేశాల నుండి నేతలు హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, జర్మనీ ఛాన్సలర్‌ ఓల్ఫ్‌ షుల్జు, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌, బ్రెజిల్‌ అద్యక్షుడు లూలా డసిల్వా, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఈయూ చీఫ్‌ ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్‌, యురోపియన్‌ కమిషన్‌, యురోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు సహా పలువురు అధినేతలు రానున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హాజరు కాబోరని క్రెమ్లిన్‌ వర్గాలు తెలిపాయి. అంత్యక్రియలు జరిగే రోజు శనివారం జాతీయ సంతాప దినంగా పాటించనున్నట్లు పోలెండ్‌ ప్రకటించింది. తూర్పు తైమూర్‌ దేశం ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. పోప్‌ మృతికి సంతాప సూచకంగా భారత్‌ మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. 22, 23 తేదీలతో పాటూ అంత్యక్రియలు జరిగే 26న సంతాప దినాలుగా పాటిస్తోంది. తన అంత్యక్రియలు జరగడానికి రోమ్‌లోని నాలుగు ప్రధాన చర్చిల్లో ఒకటైన సెయింట్‌ మేరీ మేజర్‌ను ఎంపిక చేసుకోవడంలో కూడా పోప్‌ ఫ్రాన్సిస్‌ సంప్రదాయాన్ని ఛేదించారు. వాటికన్‌ సిటీ నుండి రోడ్డు మార్గాన రోమ్‌లోని సెవెన్‌ హిల్స్‌లో ఒకటైన ఎస్క్యూలిన్‌ వరకు అంతిమ యాత్ర సాగుతుంది. పోప్‌ తన పదవికి ఒక మానవతా, వినయపూర్వకమైన కోణాన్ని ఇవ్వడానికి ఎల్లప్పుడూ పరితపించేవారు. ఆ స్ఫూర్తితోనే వాటికన్‌ సాంప్రదాయ వైభవాలను విడనాడి తన అంత్యక్రియల ప్రక్రియ, ఖననం అంతా కూడా సరళమైన ఆచార వ్యవహరాల్లో సాగాలని నిర్ణయించారు. ఆర్భాటాలేమీ లేకుండా సాదా సీదాగా తనను భూమిలో ఖననం చేయాలని ఆయన కోరారు. లాటిన్‌ భాషలో తన పేరును ఫ్రాన్సిస్కస్‌ అని మాత్రమే రాయించాలని సూచించారు.
పోప్‌ చివరి మాటలు
ఈస్టర్‌ సండే నాడు సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో వేచి వున్న వేలాదిమంది ప్రజలకు ఆశీర్వచనాలు అందచేసేం దుకు బయటకు రావడానికి సహకరించిన తన నర్సుకు పోప్‌ థ్యాంక్యూ చెప్పారు. అవే ఆయన చివరి మాటలుగా మిగిలిపోయాయి. పోప్‌కు 24గంటలూ సేవలందించిన నర్సు మాసిమిలెనో స్ట్రాపెట్టిని ఉద్దేశించి ”స్క్వేర్‌కు నన్ను తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు” అంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు వాటికల్‌ అధికార వార్తా విభాగం మంగళవారం వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -