– ఈ ఏడాది 198.85 కోట్ల పనిదినాలే
– గతేడాది కంటే 45 కోట్ల పనిదినాల తగ్గింపు
– కేటాయింపుల్లోనూ ఫక్తు రాజకీయం
– ఎన్నికలున్న బీహార్‌కు 21 కోట్ల పనిదినాలు
– తెలంగాణలో 6.5 కోట్లకు కుదింపు
– రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కేంద్ర మంత్రుల చోద్యం
– కనీసం పట్టించుకోని బీజేపీ ఎంపీలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పేదల పొట్టగొట్టేందుకు ఉపాధి హామీ చట్టానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉరితాళ్లను బిగిస్తున్నది. కేంద్ర బడ్జెట్‌లో నిధులు తగ్గించడమే కాదు..క్రమంగా పనిదినాల కల్పనకూ కోతపెడుతూ పోతున్నది. 2024-25లో దేశవ్యాప్తంగా మొత్తం 243.58 కోట్ల పనిదినాలు జరగ్గా…ఈ ఏడాది(2025-26 ఆర్థిక సంవత్సరం) 198.85 కోట్లకే పరిమితం చేసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 45 కోట్ల పనిదినాలు తగ్గనున్నాయి. ఈ పనిదినాల కేటాయింపుల్లోనూ ఫక్తు రాజకీయాలకు తెరలేపింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలున్న బీహార్ రాష్ట్రానికి పనిదినాలను భారీగా పెంచింది. తెలంగాణలో మాత్రం 5.5 కోట్ల పనిదినాలకు కోతపెట్టింది. తెలంగాణకు ఉపాధి హామీ కల్పనలో తీవ్ర నష్టం జరుగుతున్నా కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజరు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఎంపీలు సైతం నోరెత్తడం లేదు.
గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించడంతో పాటు పేదల ఆకలి తీర్చడంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం విజయవంతమైంది. ఇతర పథకాలతో పోలిస్తే ఇది చాలా భిన్నం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెంచడం ద్వారా పేద ప్రజలకు ఆర్థిక శక్తిని కలిగించడంతో పాటు కొనుగోలు శక్తిని పెంచింది.
అటు ప్రజలకు ఉపాధి, ఇటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక ఆస్తుల సృష్టి కోసం ఈ చట్టం పనిచేస్తున్నది. తెలంగాణలో మొదటి నుంచీ ఈ చట్టం పక్కాగా అమలవుతున్నది. దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా…తెలంగాణ రాష్ట్రానికి పనిదినాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీ ఎత్తున తగ్గించింది. గతేడాదితో పోలిస్తే సగానికి మన పని దినాలు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు 12 కోట్ల పనిదినాలు కల్పించబడ్డాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని 6.5 కోట్ల పనిదినాలకు కుదించింది. అంటే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని సగం మంది ఉపాధి కూలీల పొట్టగొట్టబోతున్నది. దేశ వ్యాప్తంగానూ ఇదే రకంగా కోతలు విధించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే పైసా పెంచలేదు. గతేడాది మాదిరిగానే 86 వేల కోట్ల బడ్జెట్‌నే కేటాయించారు. కూలీ రేట్లు పెరిగిన తర్వాత..గత ఏడాది బడ్జెట్‌ను కేటాయించడం ద్వారా..ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం పనిచేస్తుందన్న భావన వ్యక్తమవుతోంది.
బీహార్ ఎన్నికల్లో లబ్ది కోసమే….
కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం జేడీయూ ఎంపీల మద్దతుతో నెట్టుకొస్తున్న విషయం విదితమే. బీహార్‌లో ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జేడీయూ-బీజేపీ కూటమికి మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే రాజకీయ కోణంలో ఇప్పటికే కేంద్ర బడ్జెట్‌లో మోడీ సర్కారు అధిక నిధులను వెచ్చించిన విషయం విదితమే. దీనిపై విమర్శలు కూడా వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉపాధి హామీ పనుల కేటాయింపునూ ఎన్డీయే సర్కారు రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం విమర్శలకు తావిస్తున్నది. గతేడాది బీహార్ రాష్ట్రానికి 17 కోట్ల పనిదినాలివ్వగా..ఈ ఏడాది ఏకంగా 21 కోట్ల పనిరోజులను మంజూరు చేసింది. అంటే ఎన్నికల లబ్ది కోసం ఏకంగా 4 కోట్ల పనిదినాలను పెంచింది. మరో వైపు మహారాష్ట్రకు 3.5 కోట్ల అదనపు పని దినాలను కల్పించింది. గతేడాది 9.5 కోట్ల పని దినాలుండగా..ఈ ఏడాది 13 కోట్లకు పెంచింది. ప్రధాని నరేంద్ర మోడీ, హౌం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఒక్క పనిదినం కూడా తగ్గలేదు. గతేడాది 5 కోట్ల పనిదినాలు కల్పించగా.. ఈ ఏడాది కూడా 5కోట్ల పనిదినాలనే కేటాయించింది. హర్యానా రాష్ట్రంలోనూ అరకోటికిపైగా పనిదినాలను అదనంగా కల్పించనున్నది. అదే సమయంలో తమిళనాడు, కర్నాటక, కేరళ, తెలంగాణ విషయంలో ఉపాధి పని దినాల కల్పనలో భారీ కోతపెట్టింది. తెలంగాణలో ఉపాధి హామీ పని దినాలకు కేంద్రం భారీగా కోత విధించిన నేపథ్యంలో..తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రుల పరిస్థితి ఇరకాటంలో పడింది. పనిదినాలు పెంచేలా వారు కేంద్రాన్ని ఒప్పించకపోతే విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఆ పార్టీ ఎంపీలు కూడా నోరు తెరిచి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే. లేకపోతే రాజకీయంగా వారు మున్ముందు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే.
