జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వికలాంగుల పదం తొలగింపు

 వారి వివరాలు నమోదు చేయకుంటే ఉద్యమం : ఎన్‌పీఆర్‌డీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కోసం తయారుచేసిన ప్రశ్నాపత్రంలో వికలాంగుల వివరాలు నమోదు చేయడానికి అవసరమైన ప్రశ్నను తొలగించటం సరికాదంటూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్‌, ఎం అడివయ్య మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఆ ప్రశ్నాపత్రంలో వికలాంగుల పదాన్ని వెంటనే చేర్చాలని డిమాండ్‌ చేశారు. 2023 జూన్‌ నుంచి జాతీయ కుటుంబ ఆరో ఆరోగ్య సర్వే చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తుచేశారు. గతంలో చేసిన సర్వేలకు భిన్నంగా వికలాంగుల వివరాలను నమోదు చేయడానికి ప్రశ్నాపత్రంలో చోటు కల్పించకపోవడం సమంజసం కాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ అంటూనే వికలాంగులను విస్మరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ”వైకల్యం వైద్య ధృవీకరణపై నిర్ణయించబడుతుంది. మా సర్వేయర్లు వైద్యులు కాదు వారు మెడికల్‌ సర్టిఫికేట్లను తనిఖీ చేయలేర’ని సర్కారు చెప్పడం దాని అసమర్ధతకు నిదర్శనమని విమర్శించారు. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ ‘తప్పని డేటా ఇవ్వడం’ బదులుగా ప్రశ్నను తొలగించమని కోరడం సరికాదని పేర్కొన్నారు. వికలాంగుల వివరాలు నమోదు కోసం సర్వే చేసే వారికి తగిన శిక్షణ ఇవ్వాలని కోరారు. పైస్థాయిలో ఉన్న వ్యక్తులు తమకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. వారి నిర్లక్షంతో వికలాంగులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వికలాంగుల సమాచారం సేకరించడానికి నిరాకరిస్తున్నదని తెలిపారు. ”ఇంక్లూజివ్‌” అనే పదం ఆచరణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సెన్సస్‌, నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ), ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ని ఉపయోగించి డేటాను సంగ్రహించే విశ్లేసించే ఏజెన్సీ తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించే విభిన్న పద్ధతుల కారణంగా రకరకాలగణాంకాలు నమోదు అవుతున్నాయని తెలిపారు. 2011లోనమోదు చేసిన జనాభా లెక్కల పై ఆధారపడుతే వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వికలాంగుల జనాభా 2.21గా ఉన్నదని తెలిపారు. వీరిలో సగం మందికి కూడా ధృవీకరణపత్రాలు, కార్డులు ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వలన దేశ పౌరులుగా అన్ని హక్కులు అర్హతలను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వికలాంగుల వివరాలు నమోదు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Spread the love