Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలురహదారులే వడ్ల కల్లాలు

రహదారులే వడ్ల కల్లాలు

– కాంటాలు, లారీల్లోకి లోడింగ్‌ సైతం ఇక్కడే
– ప్రతి ఏటా తప్పని తిప్పలు
– వర్షాలొస్తే తడిసి నష్టపోతున్న అన్నదాతలు
– గ్రామీణ మార్కెట్ల నిర్మాణం పట్టని పాలకులు
– తరచూ ప్రమాదాలు.. రాకపోకలకు ఇబ్బందులు
ఏడాదికి రెండు సీజన్లల్లో పండించే వరి ధాన్యాన్ని అమ్ముకోవడం రైతులకు కత్తిమీద సాములా మారింది. దాంతో పండిన పంటల్ని కొనుగోలు చేయడమే కాకుండా మార్కెట్ల సదుపాయమూ కల్పించాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ ఆరుబయటే నిర్వహిస్తున్నారు. చెల్క భూములన్నీ సాగు భూములవ్వడంతో ధాన్యాన్ని ఆరబోసి శుద్ధి చేసేందుకు స్థలాల్లేక రైతులు రోడ్లనే వడ్ల కల్లాలుగా వాడుకోవాల్సి వస్తోంది. ఐకేపీ, పీఎసీఎస్‌, డీసీఎంఎస్‌ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పెట్టే గ్రామాల్లో శాశ్వత పరిష్కారం కోసం గ్రామీణ గోదాములు, మార్కెట్లను నిర్మించాలని రైతులు కోరుతున్నారు. రోడ్లపై ధాన్యం కుప్పలు పోయడం, కాంటా లోడింగ్‌ వేయడంతో ఇరుకుగా ఉన్న రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
యాసంగి సీజన్‌ వరి ధాన్యం సేకరణ షురూ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 56.69 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. రైతులు తమ అవసరాలకు పోగా మిగిలిన ధాన్యాన్ని మార్కెట్లకు తీసుకొస్తే దాన్నంతా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 8200 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట ఇతర జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనూ 7.22 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 1113 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ధాన్యం కొనుగోళ్లూ సాగుతున్నాయి. యాసంగిలో తరచూ అకాల వర్షాలు, వడగండ్ల వానలు కురుస్తున్నాయి. పంట కోత దశల్లో కొంత నష్టమేర్పడింది. ప్రస్తుతం వడ్లు తడుస్తుండటంతో ఇంకొంత నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మార్కెట్‌ స్థలాల్లేక రోడ్లే కల్లాలు
రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం.. ఐకేపీ, పీఎసీఎస్‌, డీసీఎంఎస్‌ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వాటి ద్వారా రైతులు తెచ్చిన ధాన్యాన్ని కాంటా వేసి కొనుగోలు చేస్తు న్నారు. ఇంత వరకు సవ్యం గానే సాగుతున్నా ధాన్యం తేమ లేకుండా ఆరబోయడం, తాలు, చెత్త లేకుండా తూర్పార పట్టడం, కాంటా వేసే వరకు రాసి పోయడం కోసం స్థలాల్లేవు. పైరును వరి కోత మిషన్‌ కోసి ధాన్యాన్ని ట్రాక్టర్‌ ట్రక్‌లో పోస్తుంది. ఆ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రాసి పోసుకోవాలి. 17 శాతం తేమ వరకు ఉండేట్టుగా ఎండబెట్టేందుకు ఆరబోయాలి. అందుకోసం ఎక్కడా స్థలాల్లేకపోవడంతో రైతులకు రోడ్లే వడ్ల కల్లాలయ్యాయి. తమ పొలాల సమీపంలో ఉన్న రోడ్లపైనే రైతులు ధాన్యం కుప్పలు పోస్తున్నారు. వీలును బట్టి రోడ్డు పొడవునా ఆరబోస్తున్నారు. మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట మూడు జిల్లాల్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ కోసం స్థలాలు లభించడంలేదు. గతంలో స్కూల్స్‌ ఇతర ఖాళీ స్థలాల్లో కేంద్రాలను నిర్వ హించారు. ప్రస్తుతం అవి కూడా అందు బాటులో లేక పోవడంతో రైతులు ఎక్కడ ధాన్యం పోస్తే అక్కడికే వెళ్లి కాంటా వేసి లారీల్లో లోడ్‌ ఎత్తుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్న హైదరాబాద్‌- ముంబయి, హైదరాబాద్‌-నాందేడ్‌ జాతీయ రహదారుల పైన కూడా రైతులు ధాన్యం ఆరబోస్తున్నారు. జోగిపేట-మెదక్‌ రోడ్డు, నర్సాపూర్‌-మెదక్‌, మెదక్‌-రామాయంపేట, జనగాం-సిద్దిపేట, పటాన్‌చెరు-జిన్నారం, బొడమటిపల్లి-మెదక్‌ ఇలా చిన్న, పెద్ద, మధ్య తరహా రోడ్లన్నీ కూడా ధాన్యం రాసులతో నిండిపోయాయి. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు సైతం రైతులు రోడ్లపైన పోసిన ధాన్యాన్ని కాంటా వేసి అక్కడే లారీలు పెట్టి లోడ్‌ నింపుతున్నారు.
ఆరుబయటే ధాన్యం కొనుగోళ్లు
ఖరీఫ్‌, యాసంగి రెండు సీజన్లలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆరుబయటే నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1113 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎక్కడా షెడ్లు లేవు. ఖాళీ స్థలాల్లేని చోట రోడ్లపైనే కాంటాలు వేస్తున్నారు. యాసంగిలో ఇప్పటికే ఐదారు సార్లు అకాల వర్షాలు కురిశాయి. బుధవారం కూడా మెదక్‌ జిల్లాలో గంటల తరబడి వర్షం పడింది. రోడ్లపైన పోసిన ధాన్యం వర్షానికి తడిసిపోవడమే కాకుండా రోడ్డు ఇరువైపులా వంపుగా ఉండటంతో ధాన్యం కొట్టుకుపోయి మట్టిలో కలుస్తుంది. రైతులు స్వంతంగా కొనుగోలు చేసిన టార్పలిన్లు తప్ప ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వడంలేదు. పట్టాల్లేక కొన్ని సార్లు, ఉన్నా వర్షం పడే సమయానికి రైతులు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తడిసి నష్టమేర్పడుతోంది. కనీసం ఖాళీ స్థలాల్ని ధాన్యం ఆరబోసుకునేందుకు వీలుగానైనా చదును చేయాలని రైతులు కోరుతున్నారు. వర్షం పడితే వరద నీరు చేరకుండా వర కట్టలు పోస్తే ఉపయోగముంటుందని చెబుతున్నారు.
తరచూ ప్రమాదాలు, వాహనాల రాకపోకలకు తిప్పలు
రోడ్లపై ధాన్యం కుప్పలు, ఆరబోయడం వల్ల సింగిల్‌ రోడ్లపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలంలో రోడ్లపైన వడ్ల రాసులు పోయడం వల్ల ఒక బైక్‌, ట్రాక్టర్‌ ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందారు. ఇతర ప్రాంతాల్లోనూ గాయాలపాలయ్యారు. వడ్లపైన బైక్‌లు నడపడం వల్ల స్కిడ్‌ అయి కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ధాన్యం ఆరబోయడం, కుప్పలు చేయడం వంటి పనుల్లో రైతు కూలీలుండటంతో వాహనాలు ఢకొీనే ప్రమాదముంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున రోడ్లపై ధాన్యం రాసులు వేయొద్దంటూ మెదక్‌ ఎస్పీ ఉదరుకుమార్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం పోసేందుకు ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల రైతులు రోడ్లపైన ధాన్యం ఆరపోయాల్సి వస్తుంది.
గ్రామీణ మార్కెట్లను నిర్మించాలి
రైతులు పండించిన పంటల్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో పాటు ఆహార ధాన్యాల నిల్వల్ని పెంచడం కోసం గ్రామీణ మార్కెట్లు, గోదాముల్ని నిర్మించాలి. ఇది ప్రభుత్వాల బాధ్యత. కానీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. రియల్‌ ఎస్టేట్‌, సాగు విస్తీర్ణం పెరిగిన తర్వాత గ్రామాల్లో ఖాళీ స్థలాలుండటం లేదు. ఒకటి లేదా రెండు గ్రామాలకు కలిపి ఒక ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఆ గ్రామాల్లో మార్కెట్‌ నిర్వహణ కోసం అవసరమైన స్థలం ఉండట్లేదు. ఎక్కడో ఒక చోట ఖాళీ స్థలాలున్నా బండరాళ్లు, చెట్లపొదలతో నిండి ఉన్నాయి. వాటిని చదును చేసి ధాన్యం కుప్పలు, ఆరబోయడం కోసం, కాంటా వేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన షెడ్లు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. గత ప్రభుత్వం గ్రామీణ గోదాములు, మార్కెట్ల ఏర్పాటుకు నిధులు కేటాయించింది. మార్కెట్ల కోసం భూ సేకరణ చేసినా అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయట్లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img