– ఏ ‘చర్చ’ చూసినా అదే తీరు
– చర్చలు, సంప్రదింపుల పొడే గిట్టని మోడీ
– గత ప్రధానులకు భిన్నంగా వ్యవహార శైలి
న్యూఢిల్లీ: ‘పరీక్షా పే చర్చ జరగబోతోంది…పరీక్షలలో ఒత్తిడిని జయించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి’….అని ఓ ప్రయివేటు పాఠశాల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ‘రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఈ అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకోకండి’… పాఠశాలలు, కళాశాలలు, ప్రవేశ పరీక్షల కోసం పుస్తకాలు ప్రచురించే ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్ ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్థులను ఉద్దేశించి సంవత్సరానికి ఒకసారి ప్రసంగించే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి ఇలాంటి పిలుపులు సన్నాహకాలు. విద్యార్థులకు సాధికారత కల్పించడం, వారి జీవితాలను మార్చేయడమే లక్ష్యంగా ప్రధాని ఏటా వారిని ఉద్దేశించి ప్రసంగిస్తుంటారు. జెనీవాలో పనిచేస్తున్న భారత శాశ్వత మిషన్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అయింది. భారత్‌లోని ప్రతి విద్యార్థి దీని కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారంటూ అది బిల్డప్ ఇచ్చింది. పరీక్షా పే చర్చ కోసం ఐదు లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని, వారిలో 3.56 లక్షల మంది విద్యార్థులని మైగోవింద అనే పోస్ట్ తెలిపింది.
కొత్త ఫీచర్లు…కొత్త ముఖాలు
గత కొన్ని సంవత్సరాలుగా మోడీ ప్రసంగాలు మూస ధోరణిలో ఉంటున్నాయి. వాటిలో కొత్తదనం ఏమీ కన్పించడం లేదు. దీంతో పరీక్షా పే చర్చ కార్యక్రమంలో కొత్త ఫీచర్లు, కొత్త ముఖాలను చేర్చారు. విద్యార్థులతో ప్రధాని ముఖాముఖి నిర్వహించడంతో పాటు దీపికా పడుకొనే, జగ్గీ వాసుదేవ్ వంటి సెలబ్రిటీలు నిర్వహించే సెషన్లు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని డీడీ, స్వయం, స్వయం ప్రభ, పీఎంఓ యూట్యూబ్ ఛానల్, సామాజిక మాధ్యమ వేదికలు సహా అనేక వేదికలలో ప్రసారం చేస్తున్నారు. విద్యార్థులకు జిల్లా స్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేస్తున్నారు.
చారు పే చర్చతో మొదలు
2014లో అహ్మదాబాద్‌లోని ఓ రెస్టారెంటులో చారు పే చర్చ కార్యక్రమానికి మోడీ శ్రీకారం చుట్టారు. ఆయనకు ఆ పదం బాగా నచ్చింది. దీంతో ప్రతి సమావేశాన్నీ ఆయన చారు పే చర్చ అనే అనేవారు. భువనేశ్వర్‌లో గృహ నిర్మాణ పథకం లబ్దిదారులతో జరిపిన సమావేశానికీ అదే పేరు పెట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగానికీ అదే పేరు. జర్మనీలోని బీజేపీ స్నేహితులు దీని నుండి ప్రేరణ పొంది అక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికాలోని మోడీ అభిమానులదీ అదే దారి. భారత్‌లో పర్యటించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా సైతం మోడీ చారు పే చర్చను ప్రస్తావించారు.
లంచ్ పే చర్చతో ముందుకు…
చారు పే చర్చ తర్వాత లంచ్ పే చర్చ వచ్చింది. 2018-19 కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడేందుకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలోనూ భోజన సమావేశాలు నిర్వహించాలని మోడీ పార్టీ ఎంపీలను కోరారు. గత సంవత్సరం ఆయన కొంతమంది స్నేహితులైన ఎంపీలతో కలిసి పార్లమెంట్ హౌస్ క్యాంటీన్‌లో లంచ్ పే చర్చ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ అడుగు ముందుకేసి తన శాసనసభ్యులకు టిఫెన్ పే చర్చ మొదలెట్టమని సూచించారు. ఇంకేముంది…రెస్టారెంట్లు, హోటళ్లు, చిన్న చిన్న ఫలహార శాలలు సైతం వేలంవెర్రిగా చారు పే చర్చ, లంచ్ పే చర్చ, థాల్ పే చర్చ అంటూ ట్యాగ్‌లైన్లు తగిలించుకున్నాయి. కొన్ని టీ స్టాల్స్ అయితే చారు పే చర్చ అని పేరు కూడా పెట్టుకున్నాయి. కొన్ని వ్యాపార సంస్థలు తమ మార్కెటింగ్ కోసం మోడీ పేరును వాడుకున్నాయి. ఉదాహరణకు మోడీ రియల్ట్రీ అనే సంస్థ ‘చారు పే చర్చ కోసం ప్రత్యేక ఆహ్వానం’ అని ప్రకటనలు విడుదల చేసింది. ముఖ్యమైన సామాజిక అంశాలపై చర్చించడానికి కొన్ని పాడ్‌కాస్ట్‌లు, బ్లాగులు ‘థాల్ పే చర్చ’ను ఉపయోగించుకున్నాయి.
ఆ రోజులే వేరు
వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులతో ఏర్పడే పార్లమెంటరీ కమిటీలను రాజకీయ విభజిత వేదికలుగా మార్చేసిన ఘనత కూడా ప్రధానిదే. బయట నుంచి వచ్చే అన్ని ప్రతిపాదనలను అధికార పార్టీ తిరస్కరిస్తుంది. ఈ విభజన ఎంత తీవ్రంగా ఉన్నదంటే పీఏసీ, సెలక్ట్ ప్యానల్స్, స్టాండింగ్ కమిటీలు, బిజినెస్ అడ్వయిజరీ కమిటీలలో నిజాయితీతో కూడిన చర్చ అనేదే కన్పించదు. ఉభయసభలకు అధిపతులుగా వ్యవహరించే వారు గతంలో ఎన్నడూ ఇంత పక్షపాతంతో వ్యవహరించిన దాఖలాలు లేవు. రాజకీయ ప్రతిష్టంభనలు ఏర్పడినప్పుడు వాటిని తొలగించడానికి మాజీ ప్రధానులు బయటి వారు చెప్పింది వినేవారు. వాటిని అవగాహన చేసుకునే వారు. అలాంటి సలహాలు, సూచనలను ప్రోత్సహించే వారు. ప్రత్యర్థి పార్టీలతో జస్వంత్ సింగ్, మురళీ దియోరాలు సంప్రదింపులు జరిపే వారు. ఇలాంటి అనధికారిక చర్చల ద్వారా రాజీ తీర్మానాలు జరుగుతుండేవి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు సెంట్రల్ హాల్‌లో ఆ సమావేశాలు జరిగేవి. అయితే మోడీ హయాంలో అలాంటి సమావేశమేదీ జరగలేదు.
వినడమే తప్ప…
పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధానిని ప్రశ్నించేందుకు 38 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ముందస్తుగా రికార్డు చేసిన ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 10న ప్రసారం చేశారు. విద్యార్థులకు మోడీ తిల్‌గుడ్ లడ్డూలు పంపిణీ చేసి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై, అది పరీక్షలపై చూపే ప్రభావంపై చిట్కాలు చెప్పారు. సుందర్ నగర్ నర్సరీలో వారితో ధ్యానం చేయించి ఒత్తిడిని ఎలా నివారించాలి, పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి అనే అంశాలపై సూచనలు చేశారు. అయితే పరీక్షా పే చర్చ అనే పేరులోనే తప్ప ఈ కార్యక్రమంలో అసలు చర్చకు ఆస్కారమే లేదు. అక్కడ కేవలం మోడీ, ఆయనకు ఇష్టులైన వారు మాత్రమే మాట్లాడతారు. ప్రశ్నించేందుకు విద్యార్థులకు పెద్దగా అవకాశం ఉండదు.
చర్చలపై విముఖత
వాస్తవానికి మోడీ పెద్దగా చర్చను ఇష్టపడరు. గత ప్రధానుల మాదిరిగా కనీసం విలేకరులతో ముచ్చటించరు. అంతేకాదు…ప్రభుత్వంలో, పార్టీలో, పార్టీ విభాగాలలో, చివరికి ఎన్డీఏ మిత్రపక్షాలతోనూ ఆయన చర్చించరు. తన వ్యక్తిగత సహాయకులు, మార్కెటింగ్ నిపుణులు అందించిన సమాచారంతో కార్యక్రమాలు రూపొందించుకుంటారు. వాటినే పార్టీ, ప్రభుత్వ సమావేశాల ముందు ఉంచుతారు. మరి పార్టీ కార్యకర్తలకు మాత్రం ప్రశ్నించే, చర్చించే అవకాశం ఎందుకు వస్తుంది? వారికి తెలిసిందల్లా అనుసరించడమే. 1952 తర్వాత లోక్‌సభ సమావేశాలు అతి తక్కువ కాలం జరిగింది మోడీ హయాంలోనే. 2021లో మోడీ లోక్‌సభకు హాజరైన మొత్తం సమయం కేవలం నాలుగు గంటలే. 2023లో శీతాకాల సమావేశాల సందర్భంగా ఏ ఒక్క బిల్లునూ పార్లమెంటరీ కమిటీకి నివేదించలేదు. గత లోక్‌సభకు ఉప సభాపతే లేరు. సభ్యులను అధిక సంఖ్యలో సస్పెండ్ చేసిన ఘనత కూడా ఆ లోక్‌సభదే.
అడక్కు…చెప్పింది విను
- Advertisement -
RELATED ARTICLES