Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుజస్టిస్‌ కె.సురేందర్‌కు తెలంగాణ హైకోర్టు ఘన వీడ్కోలు

జస్టిస్‌ కె.సురేందర్‌కు తెలంగాణ హైకోర్టు ఘన వీడ్కోలు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: మద్రాసు హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్‌ కె.సురేందర్‌కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికింది. శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌పాల్‌ నేతృత్వంలో అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి, న్యాయమూర్తులు, న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు పలికారు. జస్టిస్‌ సురేందర్‌ న్యాయవ్యవస్థకు చేసిన సేవలను వారు ఈ సందర్భంగా కొనియాడారు. కేవలం 641 రోజుల్లో 22,622 ప్రధాన కేసులను, 18,812 మధ్యంతర పిటిషన్‌లను పరిష్కరించారన్నారు. సత్యం కేసు, దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు, లుంబినీ పార్కు, గోకుల్‌ చాట్‌ల పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ తరఫున వాదనలు వినిపించారన్నారు.

జస్టిస్‌ సురేందర్‌ మాట్లాడుతూ.. ఈ కోర్టులో ఉన్న జ్ఞాపకాలను వదిలిపోతున్నందుకు భావోద్వేగంగా ఉందన్నారు. తాను పైలట్‌ పరీక్ష రాసి ఎంపికైనప్పటికీ గుండె సమస్య ఉందన్న కారణంగా వెనక్కి పంపారని తెలిపారు. కారణాలు ఏవైనా న్యాయవ్యవస్థలో సేవలు అందించే అవకాశం లభించిందన్నారు. బదిలీతో కోర్టుహాలు, భాష మారినా చేసే పని ఒకటేనన్నారు. తనకు సహకరించిన సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ జి.ప్రవీణ్‌కుమార్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వరరావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్, జస్టిస్‌ సురేందర్‌ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad