Wednesday, May 7, 2025
Homeజాతీయంట్రావెల్‌ బ్యాన్‌

ట్రావెల్‌ బ్యాన్‌

- Advertisement -

– పాక్‌ పౌరులకు స్థానం లేదు.. 48గంటల్లోగా దేశాన్ని వీడాలి
– సింధు జలాల ఒప్పందాన్ని ఆపేస్తాం
– అత్తారి చెక్‌పోస్టు మూసివేస్తాం
– ఎంబసీ సిబ్బంది కుదింపు
– పహల్గాం దాడి నేపథ్యంలో భారత్‌ సంచలన నిర్ణయాలు
– ప్రధాని మోడీ నేతృత్వంలో భద్రతా క్యాబినెట్‌ కమిటీ భేటీ
– ఉగ్రదాడిపై సమగ్ర సమీక్ష
న్యూఢిల్లీ: పహల్గాం దాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భద్రతా క్యాబినెట్‌ భేటీ (సీసీఎస్‌) బుధవారం సమావేశమైంది. దేశవ్యాప్తంగా నెలకొన్న భద్రతా పరిస్థితులను కూలంకషంగా సమీక్షించింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశానికి హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రభృతులు హాజరయ్యారు. దాడి అనంతరం నెలకొన్న పరిస్థితులు, ఇతర పరిణామాలను ప్రధాని వారితో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్‌ నిర్ణయించింది. అత్తారి చెక్‌పోస్టును కూడా వెంటనే మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. పాక్‌ జాతీయులెవరూ కూడా భారత్‌లో పర్యటించడానికి అనుమతించరాదని సమావేశం నిర్ణయించింది. భారత్‌లోని పాక్‌ జాతీయులు 48 గంటల్లోగా దేశం వీడి వెళ్లాలని పేర్కొంది. అలాగే పాకిస్తాన్‌ హై కమిషన్‌లోని వైమానిక, నావికాదళ, ఆర్మీ సలహాదారులను అవాంఛనీయ వ్యక్తులుగా ప్రకటించింది. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌ కార్యాలయం నుంచి త్రివిధ దళాలకు చెందిన ముగ్గురు సలహాదారులను, ఐదుగురు సపోర్ట్‌ సిబ్బందిని ఉపసంహరించు కుంది. ఎంబసీల్లోని సపోర్ట్‌ సిబ్బందిని 30కి తగ్గించనుంది. ప్రస్తుతం ఈ సంఖ్య 55గా వుంది. ఇది మే 1నుంచి అమల్లోకి వస్తుంది. కీలకమైన ప్రాంతాలు సహా అన్ని చోట్లా అప్రమత్తత పాటించాల్సిందిగా బలగాలను ఆదేశించింది. ఈ ఉగ్ర దాడికి బాధ్యులైన వారిని తక్షణమే పట్టుకుని, శిక్షించాలని, దీని వెనుక సూత్రధారులను కూడా అదుపులోకి తీసుకోవాలని తీర్మానించింది. అన్ని బలగాలు అప్రమత్తంగా వుండాలని ఆదేశించింది. ఈ దాడికి పాల్పడిన వారిని పట్టుకుని, తగిన శిక్షలను విధించాలని, దీని వెనుక గల సూత్రధారులను కూడా బాధ్యులను చేయాలని సమావేశం నిర్ణయించింది. అనంతరం సీసీఎస్‌ సమావేశం నిర్ణయాలను వెల్లడించడానికి విదేశాంగ శాఖ వర్గాలు మీడియా సమావేశాన్ని నిర్వహించాయి. కేంద్ర పాలిత ప్రాంతంలో విజయవంతంగా ఎన్నికలను నిర్వహించిన నేపథ్యంలో ఈ దాడి జరిగిందని విదేశాంగ కార్యదర్శి వ్యాఖ్యానించారు. అంతకుముందు దాడి వార్త తెలియగానే ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటనను కుదించుకుని వచ్చిన వెంటనే విమానాశ్రయంలో నే సమావేశమై భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఈ సమావేశానికి విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ కూడా హాజరయ్యారు. పహల్గాంలో దాడిపై వారు ప్రధానికి వివరించారు. మరోవైపు హోం మంత్రి అమిత్‌ షా మంగళవారం సాయంత్రమే శ్రీనగర్‌ చేరుకొని అక్కడ భద్రతా చర్యలను సమీక్షిస్తున్నారు.
కాశ్మీర్‌లో హైటెన్షన్‌
జమ్మూకాశ్మీర్‌లో హైటెన్షన్‌ కొన సాగుతోంది. ఓవైపు ముష్కర మూకల ఏరివేత కు భద్రతా బలగాలు వ్యూహ, ప్రతి వ్యూహాలు చేస్తుంటే.. మరోవైపు ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను బంధువు లకు అప్పగించేలా కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఇద్దరు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. పహల్గాంలో ఉగ్రదాడి మాస్టర్‌ మైండ్‌ను పట్టుకోవటానికి ఆర్మీ దళాలు అటవీ ప్రాంతంలో జల్లెడపడుతున్నాయి. ఇప్పటికీ స్వస్థలాలకు చేరని పర్యాటకులు భయం గుప్పెట్లోనే ఉన్నారు. ఉగ్రపంజాకు నిరసనగా 35ఏండ్ల తర్వాత జమ్మూ బంద్‌ పాటించారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
వెల్లువెత్తుతున్న నిరసనలు
జమ్మూకాశ్మీర్‌ భగ్గుమంటోంది. బుధవారం ఓ వైపు ఉగ్రదాడిపై దేశ, విదేశాల్లో ఉవ్వెత్తున నిరసనలు కొనసాగుతుండగా మరోవైపు అనంతనాగ్‌ జిల్లా పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో ఉగ్రదాడిని నిరసిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. దీంతో జనజీవనం స్తంభించింది. దుకాణాలు, వ్యాపార సంస్థలు, పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. ఉగ్రవాదులు మంగళవారం జరిపిన దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడిన విషయం తెలిసిందే. కాగా గత 35 సంవత్సరాల కాలంలో కాశ్మీర్‌లోయలో ఉగ్రవాద చర్యకు వ్యతిరేకంగా ప్రజాజీవనం స్తంభించి పోవడం ఇదే మొదటిసారి. శ్రీనగర్‌లోనూ, లోయలోని ఇతర ప్రాంతాలలోనూ ప్రభుత్వ వాహనాలు నామమాత్రంగానే కన్పించాయి. ప్రయివేటు వాహనాలు మాత్రం మామూలుగానే తిరిగాయి. ప్రయివేటు పాఠశాలలను మూసివేయగా ప్రభుత్వ పాఠశాలలు తెరిచే ఉన్నాయి. కాశ్మీర్‌ వాణిజ్య పరిశ్రమల మండలి (కేసీసీఐ), కాశ్మీర్‌ వ్యాపారులు-ఉత్పత్తిదారుల సమాఖ్య (కేటీఎంఎఫ్‌), మత సంస్థ ముత్తాహిదా మజ్లిస్‌ ఉలేమా (ఎంఎంయూ), జమ్మూకాశ్మీర్‌కు చెందిన గ్రాండ్‌ ముఫ్తి నసీరుల్‌ ఇస్లాం సంయుక్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ‘ఇలాంటి హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కావు. మన సమాజంలో వీటికి స్థానం లేదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ సంఘటితం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. శాంతియుత, సామరస్యపూర్వకమైన సమాజం కోసం కృషి చేయాలని కోరుతున్నాను’ అని గ్రాండ్‌ ముఫ్తి ఒక ప్రకటనలో తెలిపారు. జమ్మూ ప్రాంతంలో కూడా బంద్‌కు పూర్తి మద్దతు లభించింది. జమ్మూ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ, జమ్మూ బార్‌ అసోసియేషన్‌ పూర్తి బంద్‌కు పిలుపునిచ్చాయి. జమ్మూ నగరంలోనూ, ఇతర ప్రధాన ప్రాంతాల లోనూ బంద్‌ దృశ్యాలు కన్పించాయి. బంద్‌కు రాజకీయ పార్టీలు, నేతలు మద్దతు తెలిపారు. బాధితులకు సంఘీభావం ప్రకటించారు. లోయ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా కీలక పర్యాటక ప్రదేశాల వద్ద అదనపు దళాలను మోహరించారు. నిత్యావసరాలను విక్రయించే దుకాణాల ను మాత్రమే అనుమతించారు. లోయలోని అన్ని జిల్లా కేంద్రాలలోనూ బంద్‌ ప్రభావం కన్పించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలు, రాజకీయ పార్టీలు, మత సంస్థలు, పౌర సమాజ గ్రూపులు సంఘటితమై ఈ విధంగా బలమైన సందేశాన్ని పంపడం ఇటీవల కాలంలో చాలా అరుదు.
అత్యవసర భేటీ నిర్వహించిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో బుధవారం ఈ సమావేశానికి విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ కూడా హాజరయ్యారు.
పహల్గాం ఉగ్రదాడిలో మృతుల జాబితా ఇదే
పర్యాటకుల్లో ఆరుగురు మహారాష్ట్రకు చెందినవారే
పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన నరమేధంలో ప్రాణాలు కోల్పోయిన వారి జాబితాను అధికారులు తయారు చేశారు. ఇందులో ఐఏఎఫ్‌ కార్పోరల్‌, నేవీ, ఎక్సైజ్‌ అధికారితో పాటు కర్నాటకకు చెందిన ఓ వ్యాపారవేత్త ఉన్నారు. అయితే అధికంగా మహారాష్ట్రకు చెందిన పర్యాటకులు ఆరుగురు ఉన్నారు. గుజరాత్‌కు చెందిన వారు ముగ్గురు, కర్నాటక -ముగ్గురు, పశ్చిమ బెంగాల్‌- ముగ్గురు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌, కేరళ, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక నేపాలీ, స్థానికుడు ఉన్నారు.
పహల్గాం దాడిలో మరణించిన వారి జాబితా
దిలీప్‌ దేసాలే – మహారాష్ట్ర, ముంబయి
హేమంత్‌ జోషి సుహాస్‌ – మహారాష్ట్ర, ముంబయి
అతుల్‌ శ్రీకాంత్‌ మోని – మహారాష్ట్ర, థానే
సంజరు లక్ష్మణ్‌ లేలే – మహారాష్ట్ర, థానే
సంతోష్‌ జగ్దాలే – మహారాష్ట్ర, పుణె
కస్టోబే గనోవోటే – మహారాష్ట్ర, పుణె
బిటన్‌ అధికారి – పశ్చిమ బెంగాల్‌, కోల్‌కతా
సమీర్‌ గుహ – పశ్చిమ బెంగాల్‌, కోల్‌కతా
మనీశ్‌ రంజన్‌ (ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌) – పశ్చిమ బెంగాల్‌, పురులియాలోని ఝల్దా
మధుసూదన్‌ సోమిశెట్టిరావు – కర్నాటక, బెంగళూరు
భరత్‌ భూషణ్‌ – కర్నాటక, బెంగళూరు
మంజునాథరావు – కర్నాటక, శివమొగ్గ
యతీశ్‌ పర్మార్‌ – గుజరాత్‌, భావ్‌నగర్‌
సుమిత్‌ పర్మార్‌ (యతీశ్‌ కుమారుడు) – గుజరాత్‌, భావ్‌నగర్‌
సైలేష్‌ భారు కలథియా – గుజరాత్‌, సూరత్‌
వినరు నర్వాల్‌ (నేవీ అధికారి) – హర్యానా, కర్నాల్‌
ఎన్‌. రామచంద్రన్‌ – కేరళ, కొచ్చి
దినేశ్‌ అగర్వాల్‌ – చంఢగీఢ్‌
సయ్యద్‌ ఆదిల్‌ హుస్సేన్‌ షా – జమ్మూకశ్మీర్‌, పహల్గామ్‌
నీరజ్‌ ఉద్వానీ – ఉత్తరాఖండ్‌
జేఎస్‌ చంద్రమౌళి – ఆంధ్రప్రదేశ్‌, విశాఖపట్నం
సుశీల్‌ నాథ్యాల్‌ – మధ్యప్రదేశ్‌, ఇండోర్‌
ప్రశాంత్‌ సతపతి – ఒడిశా, బాలేశ్వర్‌
టేజ్‌ హాల్వింగ్‌ (ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కార్పొరల్‌) – అరుణాచల్‌ప్రదేశ్‌, జిరో
శుభం ద్వివేదీ – ఉత్తరప్రదేశ్‌, కాన్పూర్‌
సుదీప్‌ సోయిపాని – నేపాల్‌, రూపందేహి

ప్రధాన సూత్రధారి సైపుల్లా ఖలీద్‌
పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌) ఈ పిరికిపంద దాడికి బాధ్యత వహించింది. నిఘా సంస్థలకు సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం, ఈ దాడికి ప్రధాన సూత్రధారి లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్‌ సైఫుల్లా ఖలీద్‌. సైఫుల్లా ఖలీద్‌ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌కు చాలా సన్నిహితుడని చెబుతున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడికి రెండు నెలల ముందు సైఫుల్లా ఖలీద్‌ పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని కంగన్‌పూర్‌ చేరుకున్నాడు. జమ్మూ కాశ్మీర్‌లో లష్కరే, టిఆర్‌ఎఫ్‌ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నది అతనే.
పహల్గాం ఘటన వెనుక ఏడుగురు ఉగ్రవాదులు
వారిలో నలుగురైదుగురు పాకిస్తానీలే
పహల్గాంలోని బైసారన్‌లో ప్రకృతి అందాలు వీక్షిస్తున్న పర్యాటకులపై జరిపిన దాడిలో ఏడుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారని, వీరిలో నలుగురైదుగురు పాకిస్తానీలేనని అధికారులు తేల్చారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు ఉన్నారని ప్రత్యక్షసాక్షులు, ఇంటెలిజెన్స్‌ నివేదికలు సూచిస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. అయితే వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. ‘ఉగ్రవాదులు మాట్లాడిన ఉర్దూ భాషను పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో వాడతారు. వారితో కనీసం ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు ఉన్నారని అనుమానిస్తున్నాం. అయితే వారు కాశ్మీర్‌లోని ఏ ప్రాంతానికి చెందిన వారో ఇంకా తెలియలేదు’ అని భద్రతా సంస్థకు చెందిన ఓ అధికారి చెప్పారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులలో ముగ్గురి ఊహా చిత్రాలను అధికారులు విడుదల చేశారు. వారికి సంబంధించిన సమాచారం అందిస్తే రూ.20 లక్షల చొప్పున రివార్డు అందజేస్తామని ప్రకటించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులందరూ పిర్‌ పంజాల్‌ పర్వత శ్రేణుల ఎగువ ప్రాంతాలకు చేరుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో సైన్యం, పారామిలటరీ దళాలు, జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇదిలావుండగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బైసారన్‌లో పర్యటించి దాడి ఎలా జరిగిందో తెలుసుకున్నారు. ఆయన శ్రీనగర్‌లో భద్రతా సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. దాడిలో గాయపడిన బాధితులను బుధవారం పరామర్శించారు. కాగా ఉగ్రవాదులు కాశ్మీర్‌లోకి ఎలా ప్రవేశించారో, వారు అక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారో తెలియరాలేదు.

ఇద్దరు ముష్కరులు హతం
దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద ఉగ్రవాదులు నరమేధం సృష్టించాక… భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఇద్దరు ముష్కరులను మట్టుపెట్టాయి. ముష్కరుల ముఖ చిత్రాలనూ విడుదల చేశాయి. మిగతా ముష్కరుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే ఈ దాడిపై ఇంటిలిజెన్స్‌ విభాగం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉగ్రవాదులను వదిలిపెట్టం : అమిత్‌షా
కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇంత ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ”పహల్గామ్‌ ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి బరువెక్కిన హృదయంతో తుది నివాళులు అర్పిస్తున్నాం. భారతదేశం ఉగ్రవాదానికి తలొగ్గదు. ఈ దారుణ దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టం” అని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -