Wednesday, May 7, 2025
Homeజాతీయంబీజేపీకి 'మురుగప్ప' నజరానా

బీజేపీకి ‘మురుగప్ప’ నజరానా

- Advertisement -

– సెమీకండక్టర్‌ యూనిట్‌కు కేంద్రం అనుమతించినందుకు ప్రతిఫలం
న్యూఢిల్లీ:
సెమీకండక్టర్‌ యూనిట్‌ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందినందుకు ప్రతిఫలంగా తమిళనాడుకు చెందిన ఓ సంస్థ బీజేపీకి నజరానా చెల్లించింది. కేంద్రం నుంచి గ్రీన్‌సిగల్‌ లభించిన కొన్ని వారాల వ్యవధిలోనే నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ముట్టజెప్పింది. ‘స్క్రోల్‌. ఇన్‌’ పోర్టల్‌ కథనం ప్రకారం…2024 ఫిబ్రవరి 29న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్‌ సమావేశమైంది. గుజరాత్‌, అస్సాం రాష్ట్రాలలో మూడు సెమీకండక్టర్‌ యూనిట్ల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. వీటిలో ఒక దానిని తమిళనాడుకు చెందిన మురుగప్ప గ్రూపు నిర్మిస్తోంది. ఈ గ్రూపునకు ఫైనాన్స్‌, సైకిల్స్‌, వ్యవసాయ రంగాలలో అనుభవం ఉంది కానీ సెమీకండక్టర్‌ పరిశ్రమలో ఎలాంటి ప్రవేశం లేదు. ‘సెమీకండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు మురుగప్ప గ్రూప్‌నకు అనుమతి లభించింది. తమిళనాడుకు చెందిన ఈ సంస్థ బీజేపీకి రూ.125 కోట్లు విరాళంగా అందజేసింది. ఈ ముడుపుల వ్యవహారం అవినీతి నిరోధక చట్టానికి తూట్లు పొడిచింది’ అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీకి భారీగా విరాళాలు అందించిన సంస్థలలో మురుగప్పది మూడో స్థానం. సెమీకండక్టర్‌ యూనిట్‌కు అనుమతి రావడానికి ముందు మురుగప్ప గ్రూపు గడిచిన దశాబ్ద కాలంలో బీజేపీకి అందించిన విరాళం కేవలం రూ.21 కోట్లు మాత్రమే. గురువింద గింజ తన నలుపు ఎరుగనట్లు మోడీ తరచుగా కాంగ్రెస్‌ను అవినీతి పార్టీ అంటూ నిందిస్తుంటారు. గత సంవత్సరం మార్చి 13న ఆయన కాంగ్రెస్‌పై ఆరోపణలు సంధిస్తూ ‘వారు వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేయగలరు. కానీ సెమీకండక్టర్‌ ఉత్పత్తి కోసం వేల కోట్లు పెట్టుబడి పెట్టరు’ అని అన్నారు. అస్సాంలో సెమీకండక్టర్‌ యూనిట్లకు శంకుస్థాపన చేసిన సందర్భంగా వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో మోడీ ఈ వ్యాఖ్య చేశారు. అప్పటికి సార్వత్రిక ఎన్నికలకు కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు సంధించడానికి అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదు. కాంగ్రెస్‌ పార్టీ తాను అధికారంలో ఉన్నప్పుడు దేశీయ సెమీకండక్టర్‌ పరిశ్రమను ఏర్పాటు చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -