Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలుహైదరాబాద్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌ ప్రశాంతం

హైదరాబాద్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌ ప్రశాంతం

– ఓటింగ్‌కు దూరంగా బీఆర్‌ఎస్‌
– భారీ బందోబస్తు మధ్య కొనసాగింపు
– 112 ఓట్లకు 88 మంది ఓటు హక్కు వినియోగం
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్‌ఎంసీ లోకల్‌ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. బుధవారం హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫిషియో సభ్యుల కోసం వేర్వేరుగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లలో ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం చుట్టూ కట్టుదిట్టంగా ఆంక్షలు అమలు చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు పూర్తయింది. బీజేపీ ఎంపీలు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, డా. కె.లక్ష్మణ్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తొలుత పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 1లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఎంఐఎం హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్‌ ఓవైసీ, మాజీద్‌ హుస్సేన్‌, కౌసర్‌ మోహియుద్దీన్‌, ముంతాజ్‌ ఖాన్‌, మిరాజ్‌ జాఫర్‌ హుస్సేన్‌, మహ్మద్‌ ముబిన్‌, అహ్మద్‌ బిలాలా ఓటు వేశారు. అధికార కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ప్రస్తుత లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎంఎస్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, శ్రీగణేశ్‌తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డి పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 2లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే, టీజేఎస్‌ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఓటు వేశారు మధ్యాహ్నం వరకు ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫిషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 1లో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఓటు వేశారు.
పది గంటలకల్లా 37.51 శాతం ఓటింగ్‌
ఉదయం పది గంటల కల్లా 37.51 శాతం ఓట్లు నమోదయ్యాయి. పన్నెండు గంటల వరకు 80శాతం ఓటింగ్‌ పూర్తయింది. మధ్యాహ్నం రెండింటి వరకు కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీల కార్పొరేటర్లు 66 మంది, ఆయా పార్టీ లకు చెందిన 22 మంది ఎక్స్‌ అఫిషియో సభ్యులు ఓటు హక్కును వినియో గించుకున్నారు. సాయంత్రం 4 గంటలకల్లా 78.57 శాతం పోలింగ్‌ నమోదైంది. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
ఎంఐఎం విజయం ఖాయమే..!
జీహెచ్‌ఎంసీ లోకల్‌బాడీ స్థానం పరిధిలో అధికార కాంగ్రెస్‌ పార్టీతోపాటు బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, బీజేపీ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లున్నారు. వీరిలో 50 మంది ఓటర్లు ఎంఐఎం పార్టీకి చెందిన వారే. పోలైన ఓట్లలో సగానికి ఒక ఓటు అదనంగా వచ్చినా అభ్యర్థి విజయం సాధించినట్టేనని అధికారులు వెల్లడించిన నేపథ్యంలో ఓటింగ్‌కు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 24 మంది ఓటర్లు మినహా మిగిలిన 88 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో దాదాపు 50కిపైగా ఓట్లు మజ్లీస్‌ అభ్యర్థికి పడినట్టు సమాచారం. దాంతో ఈ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ విజయం లాంఛనమేనని తెలుస్తోంది. సుమారు 22 ఏండ్ల తర్వాత లోకల్‌ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్‌ జరిగింది. అంతకు ముందు ఈ స్థానం ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈసారి పోలింగ్‌, కౌంటింగ్‌ అనివార్యమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img