సామాజిక విప్లవకారుడు మహాత్మాజ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల జీవిత చరిత్ర ఆధారంగా ఆనాటి సమాజంలో వాళ్లు ఎదుర్కొన్న వాస్తవ సంఘటనలతో నిర్మించిన చిత్రం ఈ నెల 25న విడుదలకు సిద్ధమవ్వగా దాన్ని బ్రాహ్మణ మనువాదులు అడ్డుకోవడం బాధాకరం. సెన్సర్‌బోర్డు కూడా అనుమతినిచ్చి మళ్లీ తిరస్కరించడం శోచనీయం.198 సంవత్సరాల క్రితం ఆనాటి సమాజంలో ఉన్న బ్రాహ్మణ ఆధిపత్య కులం అవలంభిస్తున్న బానిస ధోరణిని వ్యతిరేకిస్తూ, కులాల మధ్య ఉన్న తీవ్రమైన ఆసమానతలపై ఫూలే చేసిన అసమాన పోరాటం చేశాడు. ఆ పోరాట ఘట్టాల్లోని కొన్నింటిని మాత్రమే ఆధారంగా తీసుకుని చిత్రాన్ని నిర్మించారు దర్శకుడు అనంత మహదేవన్. అతను కూడా ఒక బ్రాహ్మణుడే. ఈ సినిమా వారి మనోభావాలను ఏరకంగా దెబ్బతీస్తుందో అర్థంకావడం లేదు. ఈ సినిమా కంటే ముందే పూలే జీవిత చరిత్రను 1988-89 శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో ధారవాహికగా దూరదర్శన్‌లో ప్రదర్శించారు. అందులో కూడా అనంత మహదేవన్ నిర్మించిన పూలే సినిమాలో ఉన్న సన్నివేశాలున్నాయి. అప్పుడు రాని వ్యతిరేకత ఇప్పుడే ఎందుకు వస్తున్నది?
సెన్సార్ బోర్డు పూలే సినిమాలో కొన్ని సన్నివేశాలను తీసివేయాలని, ”మహర్, మాంగ్, పదాలను తొలగించి వాటి స్థానంలో వేరే పదాలు చేర్చాలని, అదేవిధంగా బ్రిటిష్‌వారు మన దేశాన్ని వంద సంవత్సరాలు పాలించారు కానీ మూడు వేల ఏండ్ల మన దేశాన్ని బ్రాహ్మణుల అరాచకత్వంలో శూద్రులు, అతిశూద్రులు బానిసలుగా కొనసాగుతున్నారు అన్న డైలాగ్‌ను, మూతికి ముంత, నడుముకు చీపురుతో ఉన్న సన్నివేశాలను తొలగించాలని ఇలా.. సినిమా మొత్తంలో పన్నెండు రకాల సన్నివేశాలను తొలగించాలని సినిమా దర్శకుడిని కోరింది. కానీ చరిత్రను చరిత్రగా చెప్పకుండా కల్పితంగా చెబితే ప్రజలు విశ్వసించరని దర్శకుడి మాట. 0.01 శాతం లేని బ్రాహ్మణ మనువాదులు ఈ కాలంలోనే ఇంతటి ఆధిపత్య ధోరణితో ప్రజాస్వామ్య స్వేచ్ఛను హరిస్తుంటే, ఆ కాలంలో ఎంతటి నిర్బంధం, అరాచకాలు చేశారో అర్థం చేసుకోవచ్చు. ఆనాటి చరిత్రను చెప్పి బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చూపిస్తుంది, కులాల మధ్య అంతరాలను పెంచే విధంగా ఉందంటూ బ్రాహ్మణ ఫెడరేషన్ గగ్గోలు పెడుతున్నది. అయితే గతంలో ధడక్ మూవీలో ‘మోడీ ఈ దేశంలో కులవ్యవస్థ లేకుండా చేశాడు’ అని ఓ సన్నివేశంలో చెప్పించారు. కులవ్యవస్థ లేకపోతే పూలే, అంబేడ్కర్‌లు ఎవరిపైన పోరాడినట్లు? మరి ‘పూలే’ చిత్రంపై బ్రాహ్మణులు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నట్టు? అప్పుడున్న బ్రాహ్మణులు చేసిన అరాచకాలకు నేటి బ్రాహ్మణులకు సంబంధం లేదనేది ఒక వాదన. వాస్తవమే, అలాంటప్పుడు ఏండ్లకిందట కాలగర్భంలో కలిసిపోయినా గుళ్లు, గోపురాలు, విగ్రహాలను తవ్వి తీసి కొత్త చరిత్రను రాసి వాటికి ఏవో అతీత శక్తులు వచ్చినట్టు హిందూ మత ప్రచారానికి వాడుకోవడం కూడా తప్పే కదా!
వందల, వేల సంవత్సరాల క్రితం భూమిలో కూరుకుపోయిన విగ్రహాలను తీసి ఈ ప్రాంతమంతా హిందువులదే అని ఎలా చెబుతున్నారు? మరి నిజమైన వాస్తవికత కలిగిన పూలే చరిత్రను సినిమా ద్వారా చెబితే తప్పేవలా అవుతుంది? ఆధునిక యుగంలో రాజ్యా ంగం ద్వారా నిర్మితమైన సమాజంలో ప్రతి వ్యక్తికి ఎన్నో హక్కులను పొందుతున్న కూడా శూద్రులు, అతి శూద్రుల కోసం పోరాడిన పూలే కావచ్చు, సమాజం కోసం పాటుపడిన మహనీయులు ఎవరిపైనైనా కూడా సినిమాలు తీసుకునే స్వేచ్ఛ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉందా, లేదా? ఇది ఏరకంగా చూసిన పూలే దంపతులను మోడీ ప్రభుత్వం అవమానించడమే అవుతుంది. ఏప్రిల్ 11న పూలే జయంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ దీన్ని ఆధిపత్య బ్రాహ్మణ సమాజం అడ్డుకున్నది. ఆ సినిమా యూనిట్ విడుదల చేసిన రెండు నిమిషాల ట్రైలర్‌లో వారికేం అర్థమైంది? శూద్రులు, అతిశూద్రులపై నిరంకు శత్వాన్ని ప్రదర్శిస్తూ బ్రాహ్మణులు మూడు వేల ఏండ్ల నుంచి కొనసాగిస్తున్న అరాచకత్వాన్ని పందొమ్మిదో శతాబ్దంలో పూలే దంపతుల రూపంలో తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. అది మామూలు ప్రతిఘటన కాదు, బ్రాహ్మణ సమాజం ఆచరించే మనుస్మృతి మనుగడే ప్రశ్నార్థకంగా మారిన వ్యతిరేకత. దేవుళ్ల పైన, పురోహితులపైన శూద్రులకు ఉండే విపరీతమైన భక్తి, ఆచార సాంప్రదాయాలను, పనికిమాలిన చాందసాలను, మనిషిజీవిత చరిత్ర అంతా పురోహితుని జ్యోతిష్యంలోనే ఉందంటూ చిత్ర, విచిత్రమైన కథల్ని రాసి వారి మానసిక స్థితిపై మనుస్మృతి పంజా విసిరారు.
దాన్ని ఆయుధంగా చేసుకుని శూద్రులు, అతిశూద్రులు చదువుకోరాదు, సమాజంలో ఉన్నతంగా ఉండరాదు, మంచి బట్టలు వేసుకోరాదు, వారికి ఎదురుగా రారాదు, ఎదురు నిలబడి మాట్లాడరాదు అని వల్లేవేస్తూ మనుధర్మశాస్త్రాన్ని రుద్దారు. అంతేనా, మహిళలు వంటింట్లోనే ఉండాలి, వారికి పురుషులతో పాటు సమాన హక్కులు లేవు, మహిళలు కేవలం భర్తకి సేవ చేసుకోవాలి, వితంతువు ఎదురు రాకూడదు, భర్త చనిపోతే చితిపై పడుకుని ఆహుతి కావాలి లాంటి నీచమైన అనాగరిక చర్యలకు పూనుకున్నారు. వాటిని వ్యతిరేకిస్తూ పూలే దంపతులు శూద్రులు, అతి శూద్రులు, ఇతర శ్రామిక వర్గాలను చైతన్యం చేశారు. వారికి విద్యనందించాలనే ధృఢ సంకల్పంతో అనేక పాఠశాలలు నెలకొల్పారు. వారి మరణం వరకు సాంఘిక దురాచారాలను, మూఢనమ్మకాలను రూపుమాపడం కోసం నిరంతరం శ్రమించి మహోన్నత దంపతులుగా చరిత్రలో కీర్తింపబడ్డారు. అందుకే వారి జీవిత చరిత్ర సినిమా ద్వారా నేటి సమాజానికి చెప్పాలనుకోవడం తప్పా?
అలాంటి పూలే దంపతుల జీవితం గురించి ఒక సినిమా తీస్తేనే ఇంత భయపడుతున్నారే, శతాబ్దాలుగా అధికారాన్ని అనుభవిస్తూ శూద్రులను, అతి శూద్రులను, శ్రామిక వర్గ ప్రజలను బానిసలుగా చూసిన సమాజాన్ని ఎలా భరించి ఉంటారు. ఈ చిత్రాన్ని అడ్డుకోవడం చూస్తే నేటికీ బ్రాహ్మణుల్లో మనుస్మృతి ధోరణి ఉందని అర్థమవు తున్నది.అయినా పూలే దంపతులు చేసిన పోరాటం ఒక సినిమా ద్వారానే ప్రపంచానికి తెలుస్తుంది, మా కులం చేసిన అరాచకత్వం సమాజానికి తెలవదనుకుంటే పొరపాటే. ఇది ప్రజలకు ముందే తెలిసిన వాస్తవిక చరిత్ర. దాన్ని ఎలాగో అడ్డుకోలేరు. ఇప్పుడు కొత్తగా అడ్డుకోవడానికి ఏముంటుంది సినిమాలు తప్ప. బ్రాహ్మణ మనువాదుల నిజ స్వరూపం ఏంటో, అసలు నిజమేమంటే ”పూలే” సినిమా చూస్తే కదా అది కల్పిత కథనో, వాస్తవికత కథనో తెలిసేది. దాన్ని పట్టించుకోకుండా ఏవో ఊహించుకుని సినిమాను సెన్సార్ ద్వారా అడ్డుకోవాలనుకోవడం అనైతికం.
పూలే సినిమా కంటే ముందు కొన్ని సామాజిక అంశాలతో సినిమాలు వచ్చాయి. అయినా పూలే సినిమా మొదటిది కాదు, చివరిది కాదు! సమాజానికి వాస్తవికతతను చూపించాలనే సినిమాలు వచ్చినప్పుడల్లా ఏవో కారణాలతో మోడీ సర్కార్ అడ్డుకుంటున్నది. వారికి నచ్చని సన్నివేశాల్ని సెన్సార్ రూపంలో తొలగిస్తున్నది. వారి సంఫ్‌ు పరివారానికి నచ్చే విద్వేషాలు పెంచే సినిమాలను మాత్రం ప్రోత్సహిస్తున్నది.ఈ మధ్య ఎంపురాన్ సినిమాపై కూడా ఇలాంటి కట్టుకథలే అల్లి సెన్సార్‌తో అడ్డుకునే ప్రయత్నం చేసింది.ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. మోడీ, కేంద్ర మంత్రులు కల్పిత కథలతో వచ్చే మూఢ విశ్వాసాలను పెంచి పోషించే సినిమాలకు ప్రచారకర్తలుగా పనిచేస్తు న్నారు.కాశ్మీర్‌ఫైల్, కేరళ ఫైల్స్, రజాకార్ సినిమాలు ఏ వర్గ ప్రజల ప్రయోజనాల కోసం వాడుకోబడ్డాయి. సబర్మతి మూవీని ఏకంగా పార్లమెంట్‌లోనే ప్రదర్శించారు కదా! ఈ మధ్య వచ్చిన ఛావా సినిమాతో మత ఘర్షణలు జరగడం, ఔరంగజేబు సమాధిని తవ్వాలని మహారాష్ట్రలో పెద్ద రచ్చే జరిగింది. దీనికి ఆజ్యం పోసింది బీజేపీనే కదా? ఇంకా ఛావా సినిమాను ప్రధానమంత్రినే స్వయంగా ప్రమోట్ చేయడం, పార్లమెంట్‌లో ప్రదర్శించడం, మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం అసెంబ్లీలో సినిమా వేసి చూడడం, దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి. మతవిశ్వాసాలను ఎవరైనా సరే గౌరవించాల్సిందే. కానీ వాటిని అడ్డుపెట్టుకుని విద్వేషాలను నింపడమే తగనిపని. ప్రజాస్వామ్యాన్ని మోడీ సర్కార్ అనేక రకాలుగా ఖూనీ చేసింది, నేటికీ చేస్తున్నది. ఇప్పుడు సినిమాలు, మీడియాకు కూడా బంధనాలు విధిస్తున్నది. మోడీకి నిజంగా అంబేద్కర్, ఫూలే మీద గౌరవం ఉంటే ఏప్రిల్ 25న విడుదలయ్యే ”పూలే” సినిమాను చూడాలి, పార్లమెంటులో ప్రదర్శించాలి. అదేవిధంగా దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో ప్రదర్శించేలా, దానికి వినోదపుపన్ను కూడా మినహాయించాలి. తెలంగాణలోనూ ఫూలే సినిమా ఆడే విధంగా ప్రభుత్వం తగిన చొరవ తీసుకోవాలి. అప్పుడే వారు ప్రసంగాల్లో పూలే, అంబేద్కర్‌లపై చెప్పే మాటలు జనాలు విశ్వసిస్తారు.
- డాక్టర్ మండ్ల రవి, 9177706626