Tuesday, April 29, 2025
HomeUncategorizedట్రంప్‌కు నేల కనిపిస్తోంది!

ట్రంప్‌కు నేల కనిపిస్తోంది!

ప్రపంచ దేశాల మీద ఎగిరెగిరి పడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు నేల కనిపిస్తోంది.తాను నిర్మించుకున్న ఊహాలోకపు దివి నుంచి భువికి దిగి వస్తున్నాడు. కింద పడ్డా గెలుపునాదే అన్నట్టుగా ఇంకా పిచ్చి మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. చైనా వస్తువుల మీద ప్రకటించిన 145శాతం పన్ను ఎక్కువే అని, సున్నా స్థాయికి కాకున్నప్పటికీ గణనీయంగా తగ్గిస్తామని మంగళవారం నాడు ప్రకటించగానే అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభాలబాట పట్టాయి. ఒక్కరోజు గడిచిందో లేదో మాతో ఒప్పందానికి రాని కంపెనీలు లేదా దేశాల మీద రెండు మూడు వారాల్లో పన్నులు విధిస్తామని బుధవారం నాడు మరో ప్రకటన చేశాడు. నోరేం మాట్లాడుతోందో ఏ చెవికి ఏమి వినిపిస్తోందో, చేతులేం చేస్తున్నాయో తెలియని స్థితిలో ఉన్నాడు. ఏం మాట్లాడినా, ఏ బెదిరింపులకు పాల్పడినా చైనా మాత్రం తాపీగా కుక్క కాటుకు చెప్పుదెబ్బ మాదిరి తాను చేయాల్సింది చేస్తూ చుక్కలు చూపిస్తోంది. మిగతా దేశాలు చైనా మాదిరి ప్రతిఘటిస్తే ఏమౌతుంది, రాజీ పడితే లాభపడతామా, ట్రంప్‌ను, అమెరికాను అసలు నమ్మవచ్చా, మూడు నెలల గడువు ఇచ్చాడుగా చూద్దాం అన్నట్టుగా మల్లగుల్లాలు పడుతూ కాళ్లు తొక్కుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. తొంభై నుంచి వంద దేశాలు తమతో చర్చలకు సంప్రదింపులు జరుపుతున్నా యంటూ ట్రంప్‌ యంత్రాంగం మీడియాకు చెబుతోంది.
బోయింగ్‌ కంపెనీ నుంచి చైనాకు వచ్చిన ఒక విమానాన్ని తిప్పి పంపిన చైనా మరో రెండు రాగా అవి దిగక ముందే వెనక్కు వెళ్లిపోవటం మంచిదంటే గాల్లోంచే వెనుదిరిగాయి.బోయింగ్‌ కంపెనీ అధిపతి ప్రతి రోజూ ట్రంప్‌తో భేటీ అవుతున్నాడంటే దాని ఒత్తిడి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఆఖరుకు 50 విమానాలు కావాలని చైనా ఆర్డరు పెట్టింది, వాటిలో 41 దాదాపు సిద్ధంగా ఉన్నాయి.అమెరికా విధించిన 145శాతం పన్నుల కారణంగా తాము వాటిని తీసుకోలేమని చైనా చెప్పటంతో ఇతర దేశాలకు అమ్మేందుకు చూస్తున్నారు. అవి అమ్ముడు పోకపోతే ఏం చేయాలో చెప్పండని సంస్థ అధిపతి కెలీ ఆర్ట్‌బెర్గ్‌ నిరంతరం ట్రంప్‌ను సతాయిస్తు న్నాడు. ఎలన్‌ మస్క్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది. పార్లమెంటు అనుమతి తీసుకోకుండా పన్నులను ఎలా విధిస్తారంటూ పన్నెండు రాష్ట్రాలు ట్రంప్‌ సర్కార్‌ మీద న్యాయ స్థానాలను ఆశ్రయించాయి. ఈ పిచ్చి పనులు, పన్నులను కొనసాగిస్తే గత సంవత్సరం 2.5శాతంగా ఉన్న వృద్ధి రేటు ఈ ఏడాది 0.1కి పడిపోతుందని పీటర్సన్‌ సంస్థ స్పష్టం చేసింది. ఈ పన్నుల కారణంగా ప్రపంచ వృద్ధి రేటును 3.3 నుంచి 2.5శాతానికి ఐఎంఎఫ్‌ సవరించింది. ఇలా ఇంటా బయటా వస్తున్న ఒత్తిడి, చైనా నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో ట్రంప్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఆ కారణంగా తొలిచర్యగా మూడు నెలల వాయిదా, తర్వాత చైనా మీద గణనీయంగా పన్నులు తగ్గిస్తానని ప్రకటన చేయాల్సి వచ్చింది.
ట్రంప్‌ మంగళవారం నాటి ప్రకటనతో మార్కెట్లు కాస్త కోలుకున్నప్పటికీ ఫిబ్రవరి మధ్య నుంచి ఇప్పటివరకు కోల్పోయిన సంపద విలువ ఏడులక్షల కోట్ల డాలర్లుగా ఉన్నట్లు చెబుతున్నారు.పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఏం మాట్లాడినప్పటికీ చైనాతో వాణిజ్యపోరు సాగించలేమని, పూర్తిగా రద్దు కావు గానీ పన్నులు గణనీయంగా త్వరలో తగ్గుతాయని సాక్షాత్తూ అమెరికా విత్తమంత్రి స్కాట్‌ బెసెంట్‌ జెపి మోర్గాన్‌ ఛేజ్‌ సంస్థ ఏర్పాటు చేసిన ప్రయివేటు సమావేశంలో చెప్పినట్లు సిఎన్‌ఎన్‌ టీవీ వెల్లడించింది.దానికనుగుణంగానే ట్రంప్‌ ప్రకటన ఉంది. చైనాతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవటం జరగదు గానీ సమతూకం ఉండేందుకు చూస్తున్నామని, సాధారణ వాణిజ్య కార్యకలాపాల పునరుద్దరణకు రెండు మూడేండ్లు పట్టవచ్చని కూడా బెసెంట్‌ పెట్టుబడిదారులతో చెప్పాడు.అమెరికా మాట్లాడాలనుకుంటే మా ద్వారాలు పూర్తిగా తెరిచే ఉన్నాయని, నిజంగా పరిష్కారం కనుగొనాలంటే పరస్పర గౌరవంతో చర్చలు తప్ప బెదిరింపులు, బ్లాక్‌ మెయిల్‌ చేస్తే కుదరదని, యుద్ధమంటూ చేయాల్సి వస్తే తాము సిద్ధమే అని బుధవారం నాడు చైనా స్పందించింది. చైనా మాదిరి మిగతా దేశాలు కూడా గట్టిగా ప్రతిఘటనకు సిద్దమై ఉంటే ఈ పాటికి ట్రంప్‌ పూర్తిగా దిగొచ్చి ఉండేవాడు. చైనా స్థానంలో తాము దూరాలని చూసే వారు, దాన్ని వ్యతిరేకిస్తామంటూ అమెరికా నుంచి మరిన్ని రాయితీలు పొందాలని చూస్తున్న వారూ ఇలా రకరకాలుగా ప్రపంచ దేశాలు వ్యవహరిస్తున్న కారణంగా ట్రంప్‌ బెట్టు చేస్తున్నాడు. ఇలాంటి వారికి పులుసు నీళ్లు తీయగల చైనా అంటే ఏమిటో ఈ సారి తెలిసి వస్తుందని భావిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచంలో అమెరికా పెత్తనానికి మరింత గండిపడుతుంది, ప్రపంచ రాజకీయాలే మరోబాట పట్టినా ఆశ్చర్యం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img