– ఈ ఏడాది 32 శాతం పెరిగిన రైతుల ఆత్మహత్యలు
– మరఠ్వాడలో ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు
ముంబయి: మహారాష్ట్రలో మహాయుతి పాలన అక్కడి రైతులను తీవ్ర కష్టాల్లోకి నెడుతున్నది. మరఠ్వాడ ప్రాంతంలో అన్నదాతల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాదిలో రైతుల సూసైడ్‌లు పెరిగాయి. జనవరి నుంచి మార్చి మధ్య ఇక్కడ 269 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. డివిజనల్ కమిషనర్ కార్యాలయ నుంచి వచ్చిన నివేదికను ఉటంకిస్తూ పీటీఐ దీనిని నివేదించింది. ఈ సమాచారం ప్రకారం.. గతేడాది ఇదే కాలంలో 204 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంతో పోలిస్తే ఈ సారి రైతన్నల ఆత్మహత్యలు 32 శాతం పెరుగుదలను చూడటం ఆందోళనకరం. మరఠ్వాడలోని ఎనిమిది జిల్లాల్లో.. బీడ్‌లో ఈ కేసులు అత్యధికంగా పెరిగాయి. 2025 మొదటి మూడు నెలల్లో ఈ జిల్లాలో 71 మంది రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. 2024లో ఆ సంఖ్య 44గా ఉన్నది. ఛత్రపతి శంభాజీనగర్‌లో జనవరి-మార్చి మధ్య కాలంలో 50 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నాందేడ్‌లో ఈ సంఖ్య 37, పర్భానీలో 33, ధరాశివ్‌లో 31, లాతూర్‌లో 18, హింగోలిలో 16, జాల్నాలో 13 మంది రైతు ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి.
రైతుల ఆత్మహత్యల విషయంలో అక్కడి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సర్కారుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. లోక్‌సభ మాజీ ఎంపీ, రైతు బృందం షెట్కారి సంఘటన చీఫ్ రాజు శెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందనీ, కానీ దానిని పాటించలేదని ఆయన అన్నారు. ఇది మోసపు చర్యగా అభివర్ణించారు. 2001 నుంచి మహారాష్ట్రలో 39,825 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఒక ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ కథనం. వీటిలో 22,193 మంది రాష్ట్రంలోని వ్యవసాయ సంక్షోభం కారణంగానే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
మహాయుతి పాలనలో అన్నదాతలకు కష్టాలు
- Advertisement -
RELATED ARTICLES