– బీహార్‌లోని ఝుంఝుపూర్ బహిరంగసభలో ప్రధాని మోడీ
పాట్నా: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడికి పాల్పడిన వారిని, కుట్రదారులను వారి ఊహకు మించి శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. గురువారం జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్‌లోని మధుబని జిల్లాలో ఝుంఝుపూర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఉగ్రదాడికి పాల్పడిన వారికి శిక్ష భారీగా, కఠినంగా ఉంటుందని, ఉగ్రవాదులు ఎప్పుడూ ఆలోచించని విధంగా ఉంటుందని మోడీ తెలిపారు. ఈ సభలో మోడీ తన ప్రసంగాన్ని హిందీలో ప్రారంభించారు. అయితే తరువాత మధ్య ఆకస్మాత్తుగా ఇంగ్లీషులోకి మారి ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ‘ఈ రోజు, బీహార్ నేల నుండి నేను యావత్తు ప్రపంచానికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. భారతదేశం ప్రతి ఉగ్రవాదిని, మద్దతుదారుడిని, కుట్రదారుడిని గుర్తించి, కనిపెట్టి శిక్షిస్తుంది. మేము వారిని భూమి చివర వరకు వెంబడిస్తాము. వారు వారి ఊహకు మించి శిక్షించబడతారు’ అని మోడీ ఇంగ్లీషులో పేర్కొన్నారు. ‘భారతీయుల ఆత్మ’పై జరిగిన ఉగ్రదాడికి బాధ్యులు శిక్షకు గురికాకుండా ఉండ రని మోడీ పేర్కొన్నారు. భారతదేశ స్ఫూర్తిని ఉగ్రవాదం ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేదని మోడీ ప్రకటించారు. అలాగే భారత్‌కు అండగా నిలిచిన దేశాలకు మోడీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ సభలో బీహార్‌కు రూ.13,480 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులను మోడీ ప్రారంభించారు. అలాగే బీహర్‌కు రెండో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో సహా అనేక రైళ్లను మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సభలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కూడా ప్రసంగించారు. కాగా, బీహార్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 24 తరువాత రాష్ట్రంలో మోడీ పర్యటించడం ఇది రెండోసారి.
ఊహకు మించి శిక్షిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES