– వీసాలు పునరుద్ధరించిన అమెరికా న్యాయస్థానం
జార్జియా: భారతీయులు సహా 133 మంది విదేశీ విద్యార్థు ల వీసాలను తాత్కాలికంగా పునరుద్ధరిస్తూ జార్జియాలోని అమెరికా ఫెడరల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరి సేవిస్ (స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) రికార్డులను పునరుద్ధరించాలని న్యాయమూర్తి ఆదేశించారు. వీసా పునరుద్ధరణలు పొందిన విద్యార్థులలో భారతీయులే అధిక సంఖ్యలో ఉన్నారు. విదేశీ విద్యార్థుల వీసాలను, సేవిస్ రికార్డులను అమెరికా విదేశాంగ శాఖ (డీఓఎస్), ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) రద్దు చేయడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. విద్యార్థులు చట్టాలను ఉల్లంఘించినందునే వారి వీసాలు రద్దు చేశామని అమెరికా చెబుతోంది. అయితే వీరిలో చాలా మందికి ఎలాంటి నేర చరిత్ర లేదు. న్యాయస్థానం ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలు విద్యార్థులకు ఎంతో ఊరట ఇస్తున్నాయి. వీరి వీసాలు రద్దు చేయడం అన్యాయమని, తీవ్రత లేని కారణాలతో వీరిపై చర్యలు చేపట్టారని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ‘క్యాచ్ అండ్ రివోక్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత వీసాల రద్దు మొదలైంది. విద్యార్థి వీసాలు ఉన్న వారిని కృత్రిమ మేధ సాయంతో తనిఖీలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కింద 300కు పైగా వీసాలు రద్దు చేశామని రూబియో గతంలో ప్రకటించారు.
అమెరికా ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (ఏఐఎల్‌ఏ) నివేదిక ప్రకారం ఈ సంవత్సరం జనవరి 20 నుండి 4,736 సేవిస్ రికార్డులను ఐసీసీ రద్దు చేసింది. ఏఐఎల్‌ఏ 327 నివేదికలు సేకరించగా బాధిత విద్యార్థులలో సుమారు సగం మందిభారతీయులేనని తేలింది. వీరికి ఎఫ్-1 వీసాలు ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంతో నష్టపోయిన వారిలో చైనా, నేపాల్, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్ విద్యార్థులు కూడా ఉన్నారు. అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులలో చాలా మంది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) పొందుతున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత…ముఖ్యంగా స్టెమ్ కోర్సులు అభ్యసించే విద్యార్థులకు తాత్కాలిక పని నిమిత్తం ఓపీటని అనుమతిస్తారు. ఈ పని 36 నెలల వరకూ ఉండవచ్చు. హెచ్-1బీ వంటి వర్క్ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇది ముందస్తు చర్యగా పనిచేస్తుంది. ఓపీటీ హోదాను కోల్పోతే అమెరికాలో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.
చిన్న చిన్న ఉల్ల్లంఘనలకు పాల్పడిన వందలాది మంది విద్యార్థులకు అమెరికాలో జరిమానాలు విధించారు. ట్రాఫిక్ టిక్కెట్లు లేదా యూనివర్సిటీ నిబంధనల ఉల్లంఘనలు వంటి స్వల్ప కారణాలు చూపించి అనేక మంది విద్యార్థుల వీసాలు రద్దు చేశారని ఏఐఎల్‌ఏ నివేదిక తెలిపింది. ఈ అసోసియేషన్ పరిశీలించిన 327 కేసులలో కేవలం రెండు మాత్రమే రాజకీయ కార్యకలాపాలకు సంబంధించినవి. వీసాలు రద్దు చేస్తూ విద్యార్థులకు పంపిన లేఖలలో నియమ నిబంధనలను పొందపరచలేదని న్యాయవాదులు వాదించారు. ‘నిరసన తెలపడం అమెరికాలో నేరం కాదు. స్పష్టత లేని ఆరోపణల కారణంగా విద్యార్థులు సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది’ అని ఓ న్యాయవాది చెప్పారు. సేవిస్ రికార్డుల పునరుద్ధరణపై కోర్టు ఇచ్చిన తీర్పు విద్యార్థులకు కొంత ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ దీర్ఘకాలిక ప్రభావం ఇంకా అస్పష్టంగానే ఉంది.
భారతీయ విద్యార్థులకు ఊరట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES