నవతెలంగాణ-హైదరాబాద్ :తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఈ రెండు రోజుల పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది. ప్రస్తుతం టోనీ బ్లెయిర్ ‘టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్’ అనే సంస్థను నడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఈ సంస్థతో తెలంగాణలో పెట్టుబడులు, సహకార ప్రాజెక్టులపై చర్చ జరగనుంది.
తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం రేవంత్ కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలో ఉన్న గోదావరి-బనచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయనుంది. ఈ అంశంపై సమగ్ర నివేదికను కేంద్ర జలవనరుల సంఘం అధికారులకు సమర్పించనున్నారు. అంతేకాక, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఈ పర్యటనలో చివరగా ఏఐసీసీ నేతలతో సమావేశమై, పార్టీలో పదవుల భర్తీ, నామినేటెడ్ పోస్టుల పంపిణీ వంటి కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి
- Advertisement -
- Advertisement -



